Award: మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే

ప్రజాశక్తి-హైదరాబాద్‌ : చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాకర మైన ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ పురస్కారం ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి లభించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సోమవారం ఒక ప్రకటనలో ఈ సంగతి వెల్లడించింది. అక్టోబర్‌ 8న జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనకు ఈ అవార్డు అందజేయనున్నట్లు కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌లో తెలిపారు. దాదాసాహెబ్‌ ఫాల్కె అవార్డు తనకు దక్కడం ఎంతో గర్వంగా ఉందని మిథున్‌ సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై తన స్పందన తెలియజేయడానికి మాటలు రావడం లేదు. ఈ అవార్డును నా కుటుంబానికి, ప్రపంచవ్యాప్తం గా ఉన్న అభిమానులకు అంకితం చేస్తున్నా అని మిథున్‌ తెలిపారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన మిథున్‌ చక్రవర్తి.. బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా సహాయనటుడు, విలన్‌గా కూడా ఆయన విశేషంగా రాణించాడు. 1976లో ‘మృగాయ’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మిథున్‌ తొలి చిత్రంతోనే ఉత్తమ జాతీయ నటుడిగా ఎంపికయ్యాడు. ‘ముక్తి’, ‘బన్సారీ’, ‘అమర్‌దీప్‌’, ‘కిస్మత్‌’, ‘వాంటెడ్‌’, ‘బాక్సర్‌’, ‘త్రినేత్ర’, ‘భీష్మ’, ‘సుల్తాన్‌’, ‘గురు’, ‘కిక్‌’, ‘బాస్‌’, డిస్కోడాన్సర్‌ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీ, బెంగాలీ చిత్రాలతోపాటు కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్‌పురి చిత్రాల్లోనూ ఆయన నటించారు. ‘ఐ యామే డిస్కో డాన్సర్‌’ అన్న పాట ఆయనకు దేశవిదేశాల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు పద్మభూషణ్‌ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.

➡️