సంపాదన లేదు : కుమార్తె ఐరాఖాన్‌ – అది ముఖ్యం కాదు : తండ్రి ఆమిర్‌ ఖాన్‌

ముంబయి : సంపాదన లేని జీవితం అని స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె బాధపడగా, ఆమె తండ్రి స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ స్పందిస్తూ … కుమార్తె సంపాదన తనకు ఎప్పటికీ ముఖ్యం కాదు అని చెప్పారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కుమార్తెగా సుపరిచితురాలు ఐరా ఖాన్‌. గతేడాది ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా తన తండ్రితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గన్నారు. చాలా మంది చిన్న వయసులోనే జీవితంలో సెటిల్‌ అవుతున్నా.. తాను మాత్రం డబ్బు సంపాదనపై దఅష్టిపెట్టలేకపోయానని అన్నారు. తన వయసు 25 ఏళ్లు దాటినా.. ఎలాంటి సంపాదన లేకుండా జీవిస్తున్నందుకు బాధపడుతున్నట్లు తెలిపారు. ” తల్లిదండ్రులు నాపై ఎంతో ఖర్చు పెట్టారు. ఇంత వయసు వచ్చినా ఈ ప్రపంచంలో నేను దేనికీ పనికి రాని వ్యక్తిననే ఫీలింగ్‌ వచ్చింది. ఎందుకంటే నేను ఏమీ చేయడం లేదు. రూపాయి కూడా సంపాదించడం లేదు” అని ఆమె అన్నారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్‌ ఆమె వ్యాఖ్యలను అంగీకరించలేదు. సంపాదన లేకపోయినప్పటికీ తన కుమార్తె ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. జీవితానికి సంబంధించి ఆమెకు కొన్ని సలహాలు ఇచ్చారు. ” చిన్న వయసులోనే నువ్వు ఎంతోమందికి సాయం చేస్తున్నావు. అది నాకెంతో ముఖ్యమైన విషయం. నువ్వు సంపాదించినా నేను ఇంత ఆనందాన్ని పొందేవాడిని కాదేమో. నీ సంపాదన అనేది నాకు ఎప్పటికీ ముఖ్యం కాదు ”అని వివరించారు. డబ్బు కంటే మనం చేసే పనులకే పేరు ప్రఖ్యాతలు వస్తాయని తెలిపారు. ఐరా ఖాన్‌ కొన్నేళ్ల క్రితం మానసిక కుంగుబాటుతో ఇబ్బందిపడ్డారు. థెరపీ సాయంతో ఆమె ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలోనే ఆమె ఆన్‌లైన్‌ వేదికగా మానసిక ఆరోగ్యంపై నెటిజన్లకు తరచూ సలహాలు ఇస్తుంటారు. అగస్త్య అనే ఫౌండేషన్‌ను కూడా స్థాపించారు.

➡️