‘గేమ్‌ ఛేంజర్‌’ ధరలపై రేవంత్‌ను కలుస్తా : దిల్‌రాజు

Jan 6,2025 18:49 #dil raju, #Game Changer, #prices, #Revanth

”గేమ్‌ఛేంజర్‌’ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. తెలంగాణాలోఈ సినిమాకు టిక్కెట్ల ధర విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని త్వరలోనే కలుస్తా. టిక్కెట్ల ధరలు పెంచాలని కోరతా. సిఎంను కలిసి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరతా. చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై సిఎం చాలా ముందుచూపుతో ఉన్నారు. ఒక నిర్మాతగా టిక్కెట్‌ రేట్ల పెంపుపై నా ప్రయత్నం చేస్తా. టిక్కెట్‌ రేటు పెంచటం వల్ల 18 శాతం ట్యాక్స్‌ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలకు ప్రభుత్వాల నుంచి సహాయం ఉండాలని కోరతా. ఈ విషయంలో గత ప్రభుత్వాలన్నీ పరిశ్రమకు బాగా సహకరించాయి. రేవంత్‌రెడ్డి సినీ ఇండిస్టీకి అండగా ఉంటూ అన్నీ ఇస్తానన్నారు. ఆ ఆశతోనే మళ్లీ కలుస్తా. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ నుంచి భారీస్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అందుకోసం బడ్జెట్‌ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. నేడు టాలీవుడ్‌ సినిమాలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉంది’ అని తెలంగాణా ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిఎఫ్‌డిసి) చైర్మన్‌ దిల్‌రాజు అన్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 10న గేమ్‌ఛేంజర్‌ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇద్దరు యువకుల మృతికి దిల్‌రాజు సంతాపం

రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్‌ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కాకినాడకు చెందిన తోకడ చరణ్‌, ఆరవ మణికంఠ మృతిచెందగా దిల్‌రాజు విచారం వ్యక్తంచేశారు. ఆ రెండు కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున సహాయం చేసి ఆదుకుంటానని ప్రకటించారు. భవిష్యత్తులో కూడా వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు.

ఒక్కో టిక్కెట్‌ రూ.600

రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో నిర్మాత దిల్‌రాజు బారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘గేమ్‌ఛేంజర్‌’. ఈనెల 10న తెల్లవారుజామును ఒంటిగంటకు బెనిఫిట్‌ షో వేసుకోవచ్చని ఎపి ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో టిక్కెట్‌ ధర రూ.600గా నిర్ణయించింది. మొదటి రోజు 4 గంటల ఆట నుంచి టిక్కెట్‌ ధరలు మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న టిక్కెట్‌ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్‌ థియేటర్లలో రూ.135 వరకూ పెంచుకోవటానికి; మొదటిరోజు ఆరుషోలకు అనుమతిని ఇచ్చింది. 11 నుంచి 23వ తేదీ వరకూ రోజుకు ఐదు షోలు ఉండనున్నాయి. పెంచిన ధరలు ఈనెల 23 వరకూ అమల్లో ఉంటాయి.

➡️