నిరంతరం కొత్తదనానికి ప్రాధాన్యత ఇచ్చే నిర్మాత దిల్‌రాజు మరో సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. సినిమాల్లో అధునాతన టెక్నాలజీని వాడేందుకు వీలుగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ) స్టూడియో ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మారుతున్న టెక్నాలజీ, ట్రెండ్‌కి తగ్గట్టు కొత్తగా సొంత కంపెనీ ప్రారంభించబోతున్నట్లుగా పేర్కొన్నారు. తెలుగు సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి కొత్తగా స్టూడియోను ప్రారంభించబోతున్నట్లుగా దిల్‌రాజు ఓ వీడియో ద్వారా తెలిపారు. సినిమా ప్రస్థానం మొదలైన 1913 నుంచి ఇప్పటివరకూ ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఇందులో చూపించారు. పూర్తివివరాలు మే నాలుగోతేదీన వెల్లడిస్తామని పేర్కొన్నారు. దిల్‌రాజు తాను నిర్మించే సినిమాలతోపాటుగా టాలీవుడ్‌లోని ఇతర చిత్రాల్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ సహా పలు విభాగాల్లో ఏఐ సాంకేతికను ఉపయోగించ బోతున్నారు. దీని ద్వారా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయనేది త్వరలోనే తెలియనుంది.
