ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటుడిని దుండగులు ఈవెంట్ పేరుతో పిలిచి కిడ్నాప్ చేశారు. రూ.కోటి డిమాండ్ చేశారు. వెల్ కమ్, స్త్రీ-2 చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సినీ నటుడు ముస్తాక్ ఖాన్‌ను కొంతమంది దుండగులు ఈవెంట్ కు రావాలని పిలిచి కిడ్నాప్ చేశారని అతని స్నేహితుడు శివమ్ యాదవ్ తెలిపారు. ముస్తాక్ ఖాన్‌ను దాదాపు 12 గంటల పాటు దుండగులు చిత్రహింసలకు గురిచేశారని, విడిచిపెట్టాలంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారని వివరించారు. అయితే ఈవెంట్‌కు హాజరవ్వడానికి దుండగులు ముస్తాక్‌కు అడ్వాన్స్ ఇచ్చారని, విమాన టిక్కెట్లు కూడా పంపించారని శివమ్ యాదవ్ వెల్లడించారు. కిడ్నాప్ చేసిన దండగులు ముస్తాక్, అతని కుమారుడి ఖాతాల నుంచి రూ.2 లక్షలు కాజేశారని చెప్పారు. కానీ చివరికీ వారి నుంచి తెలివిగా తప్పించుకున్న ముస్తాక్ ఖాన్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కమెడియన్ సునీల్ పాల్ ను కూడా ఇదే తరహాలో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముస్తాక్ బాగానే ఉన్నారని, కొద్ది రోజుల్లోనే మీడియాతో అన్ని విషయాలు వివరిస్తారని కుటుంబ సభ్యలు వెల్లడించారు. ఈవెంట్ పేరుతో సెలబ్రిటీలను కిడ్నాప్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/12/actor-kidnap.jpg)