ఆంధ్రాలో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలి

ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే చిన్న సినిమాల నిర్మాణం పెరగాల్సి వుందని శ్రీ చైతన్య ప్రొడక్షన్స్‌ అధినేత, నటులు, నిర్మాత ఆవుల వీరశేఖర యాదవ్‌ అన్నారు. ఎస్‌పి క్రియేషన్స్‌ పతాకంపై కె.మహేశ్వర నిర్మాత, డైరెక్టర్‌ సాయిపవన్‌ సుంకర తెరకెక్కించనున్న సినిమా ‘యమజాలీ.. లవ్‌ మీ లైలా’. ఈ చిత్ర యూనిట్‌ను గురువారం ఆయన కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వీరశేఖర యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, కోర్టు, ఎయిర్‌పోర్టు, కాలేజ్‌ వంటి సెట్లను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయటం ద్వారా షూటింగ్‌లకు అనుకూల వాతావరణాన్ని కల్పించొచ్చునన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నానన్నారు. నిర్మాత మహేశ్వర కె., డైరెక్టర్‌ సాయిపవన్‌ సుంకర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సిఎం చంద్రబాబు, ా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ కృషిచేయాలని కోరారు. ఎపిలో తెలంగాణాలో కంటే అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయన్నారు. మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వాలు బాగా ప్రోత్సాహకాలు అందజేశాయన్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వమే స్టూడియోలను ఏర్పాటుచేస్తే చిత్రపరిశ్రమను ప్రోత్సహించినట్లవుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమకు మంచి ప్రోత్సాహాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని కోరారు. చిన్న నిర్మాతలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.

➡️