సినీ నిర్మాత విజయ్ కుమార్‌ మృతి

ఏవీకే ఫిలిమ్స్‌ అధినేత, సినీనటుడు, సమర్పకులు డాక్టర్‌ ఆరిగపూడి విజయ్ కుమార్‌ (67) మంగళవారం రాత్రి హైదరాబాదులోలో గుండెపోటుతో మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన సతీమణి కృష్ణకుమారి మరణించారు. ఆమె చనిపోయిన తర్వాత మనోవేదనకు గురయ్యారు. దాంతోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు తోడవ్వటంతో గుండెపోటుకు గురయ్యారు. విజయ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దబ్బాయి కుటుంబంతో సహా తండ్రి దగ్గర, మిగిలిన ఇద్దరూ విదేశాల్లో ఉంటున్నారు. వీరంతా వచ్చిన తర్వాత శనివారం అంతిమ సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు. భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.10లోని స్వగృహంలో ఉంచుతున్నామని ఎపిఎన్‌ ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి రాపోలు దత్తాత్రి తెలిపారు. లయన్‌ శ్రీరామ్‌ దత్తి నిర్మాతగా విజయ్ కుమార్‌ సమర్పించిన ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా ఫస్ట్‌ కాపీ సిద్ధమైంది. ఈ సినిమాలో ఆయన ఒక ప్రధాన మైన పాత్ర కూడా చేశారు. కానీ విడుదల కాలేదు. విజయ్ కుమార్‌ మృతికి సినీ, టీవీ రచయిత రాజేంద్రరాజు కాంచనపల్లి, ఎపిఎన్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ లయన్‌ శ్రీరామ్‌దత్తి తీవ్ర సంతాపం తెలిపారు.

➡️