స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతివేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీతాత చెట్టు’. ఈ మూవీ ట్రైలర్‌ను కథానాయకుడు మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి మనస్సులను హత్తుకునేలా సినిమా ఉండేలా ఉందన్నారు. సుకృతి, చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టుచేశారు. తాజాగా విడుదలైన గాంధీతాత చెట్టు ట్రైలర్ చూస్తే ఓ బాలిక ఇచ్చిన మాట కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకున్న కథగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్ధాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఈనెల 24న సినిమాను విడుదల చేస్తున్నామని దర్శకురాలు పద్మావతి తెలిపారు. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భానుప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ ముఖ్యపాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు.