తెలంగాణ : ” నాకు ఎలాంటి సమస్యల్లేవు. అంతా బాగానే ఉంది ” అని సినీ హీరో విశాల్ స్పష్టం చేశారు. హీరో విశాల్ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి విదితమే. వీటిపై విశాల్ తాజాగా స్పందించారు. శనివారం సాయంత్రం ‘మద గజ రాజ’ ప్రీమియర్‌కు హాజరై.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ప్రకటించారు. ” మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యల్లేవు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్ట్‌గా పట్టుకోగలుగుతున్నా. ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలు కోలుకునేలా చేశాయి ” అని విశాల్ తెలిపారు. ఇటీవల జరిగిన ఈవెంట్‌తో పోలిస్తే ఈ ప్రోగ్రాంలో ఆయన ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించారు. విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మదగజరాజ’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గత వారం చెన్నైలో చిత్రబఅందం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఇందులో విశాల్ పాల్గన్నారు. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో … ఆయన చేతులు వణికాయి. పూర్తి నీరసంగా కనిపించారు. దీంతో ఈవెంట్‌లో పాల్గన్నవారు కంగారుపడ్డారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ.. విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విశాల్‌కు ఏమైంది ? అంటూ స్థానిక, ఆంగ్ల పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. గెట్ వెల్ సూన్ అంటూ పలువురు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన టీం వైద్యుల రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆయన వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నట్లు వివరించింది.
