ఒకే తరహా పాత్రలు ఇష్టం లేదు

తమన్నా కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘సికందర్‌ కా ముఖద్దర్‌’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌ గురించి పలు విషయాలు చర్చించారు. ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని.. విభిన్నమైన పాత్రలతో తరచూ ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నానని అన్నారు. ‘సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండిస్టీలోకి వచ్చా. దాదాపు 15 ఏళ్ల నుంచి నటిగా కొనసాగుతున్నా. గొప్ప వ్యక్తులతో కలిసి నటించా. ప్రతి సినిమా నుంచి, నటీనటుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా. కెరీర్‌ ఆరంభంలోనే తెలుగు, తమిళంలో కమర్షియల్‌ విజయాలు అందుకున్నాను. అయినప్పటికీ నటిగా ఏదో చేయాలనే తపన మాత్రం తగ్గలేదు. విభిన్నమైనవి, నన్ను సవాలు చేసే పాత్రలు చేయాలనిపించింది. కమర్షియల్‌గా సక్సెస్‌ అందుకున్న తర్వాత ప్రయోగాలు చేయడం అనవసరం అని అందరూ భావిస్తుంటారు. కాకపోతే నేను అలా అనుకోలేదు. ఆ క్రమంలోనే బాహుబలిలో యాక్ట్‌ చేశా. ఎన్నో ప్రశంసలు అందుకున్నా. ఆ తర్వాత కూడా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. కెరీర్‌లో ముందుకుసాగుతున్నా’ అని తెలిపారు.

➡️