Indian 2 Movie Review : ఇండియన్‌ 2 మూవీ రివ్యూ

విశ్వనటుడు కమల్‌హాసన్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. అవినీతిపై తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు -2 తెరకెక్కింది. ఈ సినిమా జూలై 12న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అన్నది తెలుసుకుందామా?!

కథ
చిత్ర అరవిందన్‌ (సిద్దార్థ్‌), హారతి (ప్రియా భవాని శంకర్‌)లతోపాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి సామాజిక మాధ్యమం వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. వారి చుట్టుపక్కల అధికారులు చేసిన అవినీతిని వీడియోలు చేసి ‘బార్కింగ్‌ డాగ్స్‌’ అనే పేరుతో సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటారు. వీటికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్‌ వస్తుంది. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని చూసి అరవిందన్‌ చలించిపోతాడు. ఈ అవినీతిని అరికట్టాలంటే.. ‘భారతీయుడు’లోని సేనాపతి రావాల్సిందే అనుకుని భావించి ‘కమ్‌బ్యాక్‌ ఇండియన్‌’ హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో ఇండియాకు రావాలని పోస్టులు పెడతాడు. ఈ పోస్టుల్ని సేనాపతి (కమల్‌హాసన్‌) చూసి చైనాలో ఉన్న అతను భారత్‌కు వస్తాడు. మరి వచ్చిన తర్వాత అందరూ అనుకున్నట్టుగా అతను అవినీతిని అరికట్టాడా లేదా? లేదా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
కమల్‌హాసన్‌ నటించిన ‘భారతీయుడు’ సినిమా ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ మూవీనే. ఓ స్వాతంత్ర సమరయోధుడు సమాజంలోని అవినీతిని అరికట్టేందుకు తన కుమారుడిని కూడా హత్య చేయడం వంటి సన్నివేశాలు మార్పుకు నాంది పలుకుతాయి. ఆలోచింపజేస్తాయి. అంతెందుకు ఆ సినిమాలోని పాటలు, సన్నివేశాలు, పాత్రలు ప్రేక్షకుల్ని అలా కట్టిపడేస్తాయి. అలాంటి సినిమా సీక్వెల్‌ అనగానే.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శంకర్‌ ఈసారి కూడా తెరపై ఏదో మాయ చేస్తాడు అని అనుకున్నారంతా. కానీ ఈ సినిమా శంకర్‌ రేంజ్‌లో అయితే లేదు. ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్‌లో భారత్‌లో అవినీతి ఎలా ఉందో చూపిస్తూ.. దానికి సోషల్‌మీడియాను ఎలా వాడుకోవచ్చో అరవిందన్‌ పాత్ర ద్వారా దర్శకుడు పరిచయం చేశాడు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా స్టోరీ స్టాట్‌ అయింది. ఆ తర్వాత అవినీతి పెరగడం.. దాన్ని అరికట్టాలంటే మళ్లీ భారతీయుడు రావాలని కోరుకోవడం… భారతీయుడు రాక కోసం ఓ ఫ్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేయడం వరకు బాగుంది. కథనం ఆసక్తికరంగా సాగింది. సోషల్‌మీడియాలో ‘కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌’ హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌ అయి సేనాపతికి ఆ పోస్టులు చేరి.. మళ్లీ భారత్‌కు రావాలని అనుకోవడం బాగానే ఉంది. అనుకున్నట్టుగానే సోషల్‌మీడియాలో పోస్టుల వల్ల తైపీలో ఉన్న భారతీయుడు.. ఇండియాకు వస్తాడు. కానీ సేనాపతి ఎంట్రీ సీన్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు. చైనా తరహాలో ఉన్న ఆయన వేషధారణ భారతీయులకు నచ్చేవిధంగా లేదు. సేనాపతి వచ్చిన తర్వాత వేషాలు మార్చి అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేసినా అందులో లాజిక్‌ కనిపించలేదు. భారతీయుడిని పట్టుకునేందుకు సిబిఐ అధికారి ప్రమోద్‌ (బాబీ సింహా) ప్రయత్నాలు..ఇంటర్వెల్‌ సీన్‌ కూడా ఇంట్రస్టింగ్‌గా లేదు. సెకండాఫ్‌లో సీన్స్‌ మరీ సాగదీతగా అనిపిస్తాయి. అరవిందన్‌ తన ఫ్యామిలీలో వ్యక్తులపైనే నిఘా పెట్టి అధికారులు పట్టించే వంటి సీన్స్‌ బోరింగ్‌గా అనిపిస్తాయి. ఆ తర్వాత చోటుచేసుకున్న విషాదం కూడా భారతీయుడు వల్లే అని నిందలు వేయడం పరమ రొటీన్‌గా ఉంది. ఇక చివరిగా క్లైమాక్స్‌ మర్మకళతో మరోమారు భారతీయుడు సినిమాను గుర్తుచేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రేక్షకుల సహనాన్ని శంకర్‌ పరీక్ష పెట్టినట్లే ఉంది. కమ్‌బ్యాక్‌ ఇండియన్‌ కాస్తా.. గోబ్యాక్‌ ఇండియన్‌ అన్నవిధంగా శంకర్‌ తెరకెక్కించడం కథపరంగా పేలవంగా ఉంది. పార్ట్‌ 3 కోసం దర్శకుడు ఇలాంటి ప్రయత్నాలు చేసినా.. ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేవిధంగా లేదు. ఎమోషన్స్‌ లేవు. భారతీయుడు రావడం.. అవినీతికి పాల్పడ్డవారిని హత్య చేయడం వంటి సన్నివేశాలు చూస్తే.. సేనాపతి రౌడీయిజమే కనిపిస్తుంది. హత్య చేయడానికి వెనకున్న బలమైన కారణాన్ని.. అందుకుతగ్గ ఎమోషన్‌ని డైరెక్టర్‌ తెరపై చూపించలేదు. ఇదే ఈ సినిమాకు మైనస్‌. భారతీయుడు -2ని చూడడమే కష్టంగా ఉంటే.. మళ్లీ పార్ట్‌ 3నా అన్నట్టుగా ఉంది. శంకర్‌ తెరకెక్కించిన సినిమాల్లో డిజాస్టర్‌ మూవీస్‌ ‘భారతీయుడు -2’ సినిమా నిలుస్తుంది. కానీ అవినీతిని అంతమొందించాలంటే ముందు ఇంటి నుంచే ప్రారంభమవ్వాలని సందేశాత్మకంగా చెప్పడం బాగుంది.

ఎవరెలా చేశారంటే..
కమల్‌హాసన్‌ అద్భుతంగా నటించారు. కాకపోతే ఆ పాత్రకి తగ్గట్టుగా మేకప్‌ కుదరలేదు. అరవిందన్‌ పాత్రలో సిద్దార్థ్‌ బాగా నటించాడు. ప్రియాభవానీ శంకర్‌ తన పాత్రకి న్యాయం చేసింది. ఇక సిద్ధార్థ్‌ ప్రియురాలిగా రకుల్‌ పాత్రకు పెద్దగా స్కోప్‌ లేదు. ఇక విలన్‌గా బాబీ అద్భుత నటన ఆకట్టుకుంది. అనిరుధ్‌ సంగీతం గుర్తుంచుకునేలా లేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

➡️