మా అనుబంధానికి ఏ పేరు పెట్టుకున్నా పట్టించుకోను : కోన వెంకట్‌

తెలంగాణ : ” మా అనుబంధానికి ఏ పేరు పెట్టుకున్నా పట్టించుకోను ” అని రచయిత, నిర్మాత కోన వెంకట్‌ స్పష్టతనిచ్చారు. హీరోయిన్‌ అంజలితో నిశ్శబ్ధం, డిక్టేటర్‌, గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, శంకరాభరణం.. ఇలా పలు సినిమాలు చేయడంతో దర్శకుడికి, అంజలికి మధ్య ఏదో ఉందన్న రూమర్స్‌ వచ్చాయి. వీరు రిలేషన్‌లో ఉన్నారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై కోన వెంకట్‌ స్పందించారు. ” అంజలి పై నాకు సాఫ్ట్‌ కార్నర్‌ ఉంది. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఎలా పిలవమన్నా పిలుస్తాను. తన వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికే తెలుసు. తన బాల్యం సంతోషకరంగా సాగలేదు. పేరెంట్స్‌ దగ్గర కూడా ఎప్పుడూ లేదు. పిన్ని దగ్గరే పెరిగింది. ఆమె కూడా సరిగా చూసుకునేది కాదు. తనకు ఒక సపోర్ట్‌ కావాలనిపించింది. తన బాధ చెప్పుకునేందుకు ఓ మనిషి ఉంటే బాగుండనిపించింది. నా కూతురికి ఏదైనా అవసరం ఉందంటే ఎలా నిలబడతానో అంజలికి కూడా ఎల్లప్పుడూ అలాగే నిలుచున్నాను. దాన్ని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. నేనవేవీ పట్టించుకోను. గీతాంజలి సినిమా సమయంలోనే అంజలి నాకు తొలిసారి పరిచయమైంది. అదే సమయంలో చెన్నైలో తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె పిన్నివాళ్లు అంజలి ఆస్తిని కబ్జా చేశారు. అలాంటి సమయంలో నిస్వార్థంగా తనకు అండగా నిలబడే ఓ స్నేహితుడు అవసరం అనిపించింది. నన్ను ఫ్రెండ్‌, అన్న, తండ్రి, గురువు, దైవం.. ఏదనుకున్నా పర్లేదు. నేను పోలీసులతో మాట్లాడి తనకు అండగా నిలబడ్డాను. ఆమె తొలిసారి బీఎమ్‌డబ్ల్యూ కారు కొనుకున్నప్పుడు నా చేతుల మీదుగా ఇవ్వమని అడిగింది. సరేనని నా చేతులమీదుగా కారు తాళాలు తన చేతికిచ్చాను. దానికి నేనేదో ఆమెకు కారు గిఫ్ట్‌ ఇచ్చానని రాసేశారు. మా అనుబంధానికి మీరు ఏ పేరైనా పెట్టుకున్నా నేను పట్టించుకోను ” అని కోన వెంకట్‌ వివరించారు.

➡️