కళాశాల నేపథ్యంలో ముగ్గురు యువకులు చేసే అల్లరి ప్రధానంగా రూపొందిన వినోదాత్మక చిత్రం ‘మ్యాడ్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రానికి సీక్వెల్‌గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ను తీసుకురాబోతుంది. కేవలం ప్రకటనతోనే ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ”లడ్డు గాని పెళ్లి” అనే బరాత్ గీతంతో ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది చిత్ర బృందం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ”లడ్డు గాని పెళ్లి”ని సెప్టెంబర్ 20న విడుదల చేశారు.
శ్రీకరా స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
