పోలీసుల విచారణకు మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో హాజరు

కొచ్చి : మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆయన తన న్యాయవాదితో కలిసి నేటి ఉదయం 10 గంటల సమయంలో ఎర్నాకుళం నార్త్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. షైన్‌ టామ్‌ చాకోకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. శనివారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసు బృందం హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్‌ టామ్‌ చాకో అక్కడి నుండి పారిపోయినట్లు సోషల్‌ మీడియాలో దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ సమయంలో మూడో అంతస్తులో ఉన్న అతను.. కిటికీలోంచి రెండో అంతస్తులోకి దూకి అక్కడి నుంచి పారిపోయినట్లు సీసీ దృశ్యాలు వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని కొచ్చి పోలీసులు షైన్‌ టామ్‌ చాకోకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. డ్రగ్స్‌ వినియోగం అంశంపైనా ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం. త్రిసూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు కుటుంబ సభ్యులకు నోటీసులు అందించారు. ఆ సమయంలో సదరు నటుడు అక్కడ లేడు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎర్నాకుళం నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌కు రావాలని పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు … షైన్‌ టామ్‌ చాకో నేడు పోలీసుల ముందు హాజరయ్యారు. ఇదిలాఉండగా, మరోవైపు … సినిమా సెట్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇటీవల నటి విన్సీ సోనీ అలోషియన్‌ ఆరోపించారు. కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌తో పాటు ‘అమ్మ’ అసోసియేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఆయనను విచారించడానికి ఓ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ముందు కూడా తన కుమారుడు చాకో హాజరుకానున్నట్లు ఆయన తండ్రి వెల్లడించారు.

➡️