మాజీ భార్య అనొద్దు : సైరా బాను

ముంబయి : తాము ఇంకా చట్టపరంగా విడాకులు తీసుకోలేదని, కేవలం విడివిడిగానే ఉంటున్నామని ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్‌ భార్య సైరా బాను తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్‌ అస్వస్థతకు గురైనట్లు ఆదివారం ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రెహమాన్‌ ఆరోగ్య పరిస్థితిని ఉద్దేశించి ఆయన భార్య సైరా బాను తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. అంతేకాకుండా, తన గురించి ప్రస్తావించేటప్పుడు రెహమాన్‌ మాజీ భార్య అనొద్దని ఆమె ఈ సందర్భంగా కోరారు. తాము ఇంకా అధికారికంగా విడాకులు పొందలేదన్నారు. కొంతకాలంగా తాను అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నానని.. అందుకే దూరంగా ఉంటున్నామని ఆమె వెల్లడించారు. అంతేకానీ విడాకులు తీసుకోలేదని మరోసారి స్పష్టం చేశారు. ఏఆర్‌ రెహమాన్‌, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. 29 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత వీరు విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు. విడాకులపై ఏఆర్‌ రెహమన్‌ స్పందిస్తూ.. ‘మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం” అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ఈ క్రమంలోనే రెహమాన్‌ తీరును తప్పుపడుతూ పలు కథనాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆయా కథనాలను సైరా కొట్టిపారేశారు. తన భర్త ఎంతో మంచి వాడని ఆమె చెప్పారు. మరోవైపు, ఛాతీ నొప్పి కారణంగా రెహమాన్‌ ఆస్పత్రిలో చేరినట్లు ఆదివారం ఉదయం కథనాలు వచ్చాయి. దీనిపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. డీహైడ్రేషన్‌, గ్యాస్ట్రిక్‌ సమస్య కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారని.. ఈ మేరకు చికిత్స తీసుకున్నారని ఆయన సోదరి తెలిపారు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా ధ్రువీకరించారు. చికిత్స అనంతరం ఆయన్ని డిశ్చార్జ్‌ చేసినట్లు వెల్లడించారు.

➡️