సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో మయోసైటిస్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఈ డిసీజ్ లక్షణాలు ఎప్పుడు బయటపడ్డాయో వివరించారు. ‘2022లో అక్షయ్ కుమార్‌తో కలిసి నేను కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లా. నేను చాలా ప్రశాంతంగా ఉన్నానని.. కెరీర్‌పై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు షోలో కరణ్‌తో చెప్పా. ఆ షూటింగ్‌లోనే నాకు ఉన్నట్టుండి చాలా నీరసంగా అనిపించింది. షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు వచ్చేశా. ఆ తర్వాతి రోజు ‘ఖుషీ’ సినిమా షూటింగ్ కోసం వెళ్లా. అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. ఆ షూటింగ్‌లో కూడా చాలా నీరసంగా అనిపించింది. శరీరం మొత్తం షట్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అప్పటి నుండే ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఏం జరుగుతోందో తెలియలేదు. వ్యాధిని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు అందరికీ తెలిసినవే. ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నా. దీన్నుంచి కోలుకునేందుకు ఇంకొంత సమయం పట్టొచ్చు’ అని సమంత వివరించారు.