సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల వేదిక ఆస్కార్ కొత్తగా స్టంట్ డిజైన్ విభాగాన్ని చేర్చు తున్నట్లు ప్రకటించింది. 2028 నుంచి ఈ విభాగంలో ఆస్కార్ పురస్కారాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 2027లో విడుదలయ్యే సినిమాలు ఈ విభాగంలో పోటీపడొచ్చునని తెలిపింది. ఈ మేరకు అకాడమీ గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్‌చేసింది. ‘సినిమాలో స్టంట్స్ అనేవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడవి ఆస్కార్‌లోనూ భాగమయ్యాయి. స్టండ్ డిజైన్ విభాగంలో పురస్కారాలు ఇవ్వనున్నాం. 2028లో జరగబోయే 100వ ఆస్కార్ వేడుకలో వీటిని ప్రధానం చేయనున్నాం’ అంటూ ప్రకటించింది. ఈ మేరకు స్టంట్ డిజైన్ ఆస్కార్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోని ఫొటోను ఉపయోగించింది. ఇది చూసిన ఆ సినిమా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి సంతోషాన్ని వ్యక్తంచేశారు. ‘2027లో రిలీజయ్యే చిత్రాలకు స్టంట్ డిజైన్ కేటగిరీలో ఆస్కార్ ఇస్తారని ప్రకటించినందుకు డేవిడ్ లెయిచ్, క్రిస్ ఓ హర, అకాడమీ సిఇఒ బిల్ క్రామర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్, స్టంట్ నిపుణులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆస్కార్ విడుదల చేసిన విజువల్ చూసి చాలా థ్రిల్లయ్యాను’ అంటూ ట్వీట్‌చేశారు.
