తెలంగాణ : అగ్నిప్రమాదంలో గాయపడిన ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకున్నాడు. చిన్న కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి పవన్ దంపతులు శనివారం రాత్రి సింగపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. పవన్ తన కుమారుడిని ఎత్తుకుని వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సింగపూర్‌లోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో పవన్ భార్య అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. గతేడాదిలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆమె పట్టా అందుకున్నారు. ఆ కార్యక్రమంలో పవన్ కూడా పాల్గన్నారు. ఆమె అక్కడ చదువుకుంటుండటంతో తన కుమారుడు మార్క్ శంకర్ ను కూడా సింగపూర్‌లోనే స్కూల్‌లో చేర్పించారు. అగ్ని ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. దీంతో కొన్ని నెలల పాటు పవన్ ఫ్యామిలీ హైదరాబాద్‌లోనే ఉంటుందని సమాచారం. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని.. కోలుకుంటున్నాడని పేర్కొన్నారు. ప్రమాదం గురించి తెలిసి మార్క్ శంకర్ క్షేమాన్ని ఆకాంక్షించిన రాజకీయ నాయకులు, జనసేన నేతలు, అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. క్లిష్ట సమయంలో వారి సందేశాలు, ప్రార్థనలు తమ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయన్నారు.
