రామ్‌గోపాల్‌ వర్మ ఇంటికి ఎపి పోలీసులు

  • విచారణకు హాజరు కావాలని నోటీసులు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎస్‌ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని పోలీసుల బృందం బుధవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వర్మ ఇంటికి వెళ్లింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌ సమయంలో.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్దిపాడు మండల టిడిపి కార్యదర్శి ఎం రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తుళ్లూరులోనూ రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌ ఫొటోలను రామ్‌గోపాల్‌ వర్మ గతంలో మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️