ప్రముఖ గాయకుడు జయచంద్రన్‌ ఇకలేరు

తిరువనంతపురం : ఆరు దశాబ్దాలుగా తన గాత్రంతో అలరించిన ప్రఖ్యాత పి జయచంద్రన్‌ (80) ఇకలేరు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలో త్రిశ్సూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణ వార్త తెలియగానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయచంద్రన్‌ మరణం దక్షిణాది సంగీతరంగానికి తీరని లోటు అని విజయన్‌ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయచంద్రన్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

తెలుగులో సూపర్‌ హిట్‌ పాటలు

జయచంద్రన్‌ తెలుగులో పాడిన పలు పాటలు హిట్‌గా నిలిచాయి. హ్యాపీ హ్యపీ బర్త్‌డేలు (సుస్వాగతం), రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి) వంటి పాటలు విశేష ఆదరణ పొందాయి. తెలుగులో ఆయన పాడిన ‘నా చెల్లి చంద్రమ్మ’ (ఊరు మనదిరా) చివరి పాట 2002లో విడుదలైంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో 16 వేలకు పైగా పాటలు పాడారు. ఇళయరాజా, ఎఆర్‌ రెహమాన్‌, ఎంఎం కీరవాణి, విద్యా సాగర్‌, కోటి తదితరుల సంగీత దర్శకత్వంలో ఆయన ఎక్కువగా పాటలు పాడారు.
1986లో బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా నేషనల్‌ అవార్డు (శ్రీ నారాయణ గురు సినిమాలోని పాటకుగానూ), 5 కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు వచ్చాయి. రెండు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు కూడా జయచంద్రన్‌ను వరించాయి. గాయకుడిగానే కాకుండా తెరపై కూడా జయచంద్రన్‌ కనిపించారు. మలయాళ సినిమాలు ‘నఖక్ష తంగళ్‌’, ‘ట్రివేండ్రం లాడ్జ్‌’ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు.

➡️