అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప 2: ది రూల్’. రష్మిక మందన్న హీరోయిన్. డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తెలంగాణా వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచు కునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు బెనిఫిట్‌షోతో పాటు అర్థరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచింది. ఈ షో చూడా లంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర ర.1000 అవుతుండగా, మల్టీఫ్లెక్స్‌లో రూ.1200లకుపైగా అవుతుంది. ఇక అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకూ అదనపు షోలకు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. 9 నుంచి 16 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. 17 నుంచి 23 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పుష్ప 2 ఆరు భాషల్లో 12 వేలకుపైగా థియేటర్లలో విడుదల కానుంది. అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం ఉందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభంకాగా రికార్డుస్థాయిలో టికెట్ల విక్రయాలు ఓవర్సీస్‌లో జరిగాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ రూ.300 కోట్లు వరకూ పారితోషికం తీసుకున్నట్లుగా తెలిసింది. ఫోర్బ్స్ ఇండియా 2024 అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 నటుల్లో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నారని ప్రకటించింది.