హైదరాబాద్ : ‘ ఎంతోకాలం తర్వాత మనసుని హత్తుకునే మంచి ప్రేమకథా చిత్రాన్ని చూశాను.. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా..! ” అని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ‘తండేల్’ సినిమా గురించి చెబుతూ ప్రశంసించారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. గీతా ఆర్ట్స్ 2 బ్యాన లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిచారు. తండేల్ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ సీన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళుతున్న తండేల్ సినిమాపై సెలబ్రిటీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈక్రమంలోనే … తండేల్ మూవీని చూసిన దర్శకుడు రాఘవేంద్రరావు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆదివారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
” చాలా రోజుల తర్వాత తండేల్ లాంటి అద్భుతమైన ప్రేమకథ చూశాను.. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ధ బాగుంది. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న గీతా ఆర్ట్స్ కి అభినందనలు.. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక దర్శకుడి సినిమా ” అని ట్విట్టర్ లో రాఘవేంద్ర రావు పేర్కొన్నారు.
శత చిత్రాల దర్శకుడు సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు ప్రశంసలందించడంతో తండేల్ చిత్ర యూనిట్ సంతోషంలో మునిగింది. సీనియర్ దర్శకుడి నుంచి ప్రశంసలు రావడంపై హీరో నాగచైతన్య ఆనందం వ్యక్తం చేశారు. ” థాంక్యూ సో మచ్ సర్. మీ మాటలు నాకెంతో విలువైనవి. మీకు మా సినిమా నచ్చినందుకు సంతోషం” అని బదులిచ్చారు.
రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘తండేల్’ చిత్రం రూపొందింది. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా, పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకుంది. తండేల్ రాజుగా నాగచైతన్య, సత్యగా సాయిపల్లవి నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో చైతన్య తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేశారు. ఆయా సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకుంటున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ. 21 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ దీనిని నిర్మించిన సంగతి విదితమే.