Sai Pallavi – ‘ జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశ .. ఎందుకంటే ‘ : సాయిపల్లవి

హైదరాబాద్‌ : ” జాతీయ అవార్డు అందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది ” అని హీరోయిన్‌ సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దక్షిణాదిలో ఉన్న అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి పేరు కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. తాను ఏ పాత్ర పోషించినా దానికో విశిష్టత తీసుకొస్తారు. కథానాయిక అంటే మూడు పాటలు, నాలుగు సన్నివేశాలు అనే పడికట్టు సూత్రాన్ని పక్కన పెట్టి, కథలో తనకూ ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటారు సాయిపల్లవి. అలాంటి కథలను మాత్రమే ఆమె ఎంచుకుంటారు. తన పాత్రకు ప్రాధాన్యం లేదని అనిపిస్తే, స్టార్‌ సినిమాలైనా సరే ఆమె పక్కన పెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. ‘మలార్‌’ నుంచి ‘సత్య’ వరకూ పాత్ర ఏదైనా సరే తన నటనతో ప్రాణం పోశారు నటి సాయిపల్లవి. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారీ భామ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జాతీయ అవార్డు కోసం తాను ఎదురుచూస్తున్నానన్నారు. అందుకొక బలమైన కారణం కూడా ఉందని చెప్పారు.
” జాతీయ అవార్డు అందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఎందుకంటే, నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర ఇచ్చింది. పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకుందామనుకున్నా. ఆ తర్వాత మూడేళ్లకు సినిమాల్లోకి అడుగుపెట్టా. నా తొలి చిత్రం ‘ప్రేమమ్‌’ కోసం వర్క్‌ చేశా. పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను. జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప. కాబట్టి, దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా. దానిని అందుకున్నా, అందుకోకపోయినా.. ఈ చీర ధరించే వరకూ నాపై ఒత్తిడి ఉంటూనే ఉంటుంది” అని సాయిపల్లవి తెలిపారు. సాయిపల్లవి కథానాయికగా నటించిన రీసెంట్‌ మూవీ ‘తండేల్‌’. బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకున్న సంగతి విదితమే.

➡️