సినీ దర్శకుడిపై స్కూటరిస్టులు కర్రలతో దాడి

Mar 14,2025 09:24 #Attacked, #Film director, #with sticks

బంజారాహిల్స్‌ (తెలంగాణ) : ప్రమాదకరంగా బైక్‌లపై దూసుకెళ్తున్న యువకులను ఎందుకలా డ్రైవ్‌ చేస్తున్నారంటూ ప్రశ్నించిన సినీ డైరెక్టర్‌పై స్కూటరిస్టులు కర్రలతో దాడి చేసి గాయపరిచిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ – 5 లో నివసించే సినీ దర్శకుడు మీర్జాపురం అశోక్‌తేజ బుధవారం రాత్రి మాదాపూర్‌ నుంచి కృష్ణానగర్‌ వెళ్తుండగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ – 10 నుంచి రెండు బైక్‌లపై నలుగురు యువకులు మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవ్‌ చేస్తూ ఓవర్‌టేక్‌ చేస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారు. దీనిని గుర్తించిన అశోక్‌ తేజ ఎందుకలా స్పీడ్‌గా వెళుతున్నారని ప్రశ్నించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు అతడిని చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు. వారి బారినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. దీనిని గుర్తించిన వాహనదారులు అక్కడికి చేరుకోవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. సదరు యువకులు పల్సర్‌, ఎఫ్‌జెడ్‌ బైక్‌లపై రాత్రిళ్లు ఆవారాగా తిరుగుతూ, దారిన పోయేవారిని వేధిస్తూ ప్రశ్నస్తే కొడుతూ అందినకాడికి డబ్బులు లాక్కుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

➡️