‘స్లమ్‌డాగ్ మిలియనీర్’.. 2008లో విడుదలైన ఈ సినిమా 8 ఆస్కార్‌లను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఇప్పుడు దీని సీక్వెల్‌కు సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. ఇటీవల ప్రారంభించిన బ్రిడ్జ్ 7 అనే నిర్మాణసంస్థ ఈ సినిమా సీక్వెల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ది హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘కొన్ని కథలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఎన్ని సంవత్సరాలైనా అవి ఆసక్తిగానే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’. మంచి కథకు భాషాపరమైన హద్దులు ఉండవని ఈ చిత్రం నిరూపించింది’ అన్నారు. ముంబయి మురికివాడల్లో నివసించే చిన్నారుల జీవనం, వారిలో ఉండే ప్రతిభను హృద్యంగా ఈ చిత్రంలో ఆవిష్కరించారు. అలాంటి వాతావరణంలో పెరిగిన ఓ బాలుడు తన తెలివితేటలతో కౌన్ బనేగా కరోడ్‌పతిలో రెండు కోట్లు ఎలా గెలుచుకున్నాడనేది దీని కథాంశం. డానీ బాయిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. 10 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకోగా.. 8 విభాగాల్లో అవార్డును గెలుచుకుంది. నాలుగు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను కైవసం చేసుకుంది.