రామ్‌చరణ్, కియారా అద్వానీ నటించిన చిత్రం ‘గేమ్‌ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను ‘దిల్’రాజు నిర్మించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నారు. వచ్చే సంక్రాంతి సినిమాగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ పూర్తిగా నిమగమైంది. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత రామ్‌చరణ్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో అక్కడి మార్కెట్‌పై చిత్ర యూనిట్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీజర్‌ను లక్నో వేదికగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల వేడుకను బాలీవుడ్‌లో చాలా గ్రాండ్‌గా జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్‌చేసింది. ఆ తర్వాత ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను కూడా పెద్దఎత్తున నిర్వహిస్తారు. ఈ రెండింటిలో ఒక దానిలో బాలీవుడ్ స్టార్ షారూక్‌ఖాన్ హాజరు కానున్నారు. గతంలో డైరెక్టర్ శంకర్ తన మూవీ ప్రమోషన్స్ కోసం చాలాసార్లు హాలీవుడ్ స్టార్స్‌ను ఆహ్వానించారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ‘గేమ్‌ఛేంజర్’ మార్కెట్‌ను పెంచుకునేందుకు షారూక్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్‌చంద్ర కీలకపాత్రల్లో నటించారు.