రజనీకాంత్‌ కోసమే… : శివరాజ్‌కుమార్‌

‘జైలర్‌’ సినిమాను రజనీకాంత్‌ కోసమే చేశా. చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూనే ఉన్నా. ఆయన మా కుటుంబంలోని వ్యక్తిలాగే అనిపిస్తారు. అడగ్గానే ఒక్క క్షణం ఆలోచించకుండా ఒప్పేసు కున్నా. ఆయన నాకు తండ్రిలాంటివాడు. అందుకే ఎంత చిన్న పాత్రయినా సరే రెడీ అని చెప్పాను. కథేంటి కూడా అడగలేదు. వాళ్లే పిలిచి మరీ కథంతా చెప్పారు. ఏదేమైనా సరే, నేను యాక్ట్‌ చేస్తానని భరోసా ఇచ్చా. కానీ నా లుక్‌, రోల్‌ అంత బాగా వర్కవుట్‌ అయిందనేది నాకిప్పటికీ అర్థం కాదు. సినిమా రిలీజయ్యాక దేశ విదేశాల నుంచి నా ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి అదిరిపోయిందని పొగిడారు. నేను చేసిందే రెండు సీన్లు కదరా అంటుంటే అయినా కూడా సూపర్‌ అని మెచ్చు కున్నారు. అమ్మతోడు…నేనంత గొప్పగా ఏమి చేశానో నాకిప్పటికీ అర్థం కాదు. సిగరెట్‌ పట్టుకుని నడిచావ్‌, టిష్యూ డబ్బా తన్నావు… అంతకుమించి ఏం చేశావ్‌? అని నా భార్య ఇప్పటికీ దెప్పి పొడుస్తుంది. బహుశా అదే కారణమేమో!. గుడ్‌ లుక్స్‌ వల్ల కావొచ్చు. ఈ విషయంలో డైరెక్టర్‌ నెల్సన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, నన్ను బాగా చూపించిన కెమెరామెన్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నా. ‘జైలర్‌ 2’లో కూడా నేను నటిస్తున్నా’ అని కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ అన్నారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘జైలర్‌’ సినిమా విడుదలై రెండేళ్లయ్యింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాలో అతిథిపాత్రల్లో శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌ బాగా నటించి మెప్పించారు. కర్నాటకలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా మాట్లాడుతూ శివరాజ్‌ కుమార్‌ పై విధంగా స్పందించారు.

➡️