ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి టాలీవుడ్‌కు చెందిన పెద్ద హీరోల సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ కొనసాగినా కొంత మిశ్రమ ఫలితాలొచ్చాయి. గతేడాది పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువగా రావటంతో చిత్రసీమ ఆటుపోట్లను ఎదుర్కొంది. హనుమాన్, గుంటూరుకారం, సైంధవ్ చిత్రాలు విడుదలవ్వగా, హనుమాన్, ఆ తర్వాత గుంటూరు కారం బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. వేసవి తర్వాత వచ్చిన కల్కి, సెప్టెంబర్‌లో వచ్చిన దేవర బాగా ఆడాయి. ఆఖరులో వచ్చిన ‘పుష్ప 2’కు పోటీగా మరే చిత్రమూ పెద్దవి లేవు. బచ్చలమల్లి, నితిన్ రాబిన్‌హుడ్, ప్రియదర్శి సారంగపాణి జాతకం వంటి చిత్రాలు ఉన్నా అవి పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ ఏడాది గేమ్‌ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చినా ‘సంక్రాంతికి వస్తున్నాం..’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో డాకు మహారాజ్, గేమ్‌ఛేంజర్ నిలిచాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం 2019లో ఇదే హీరోలు నటించిన సినిమాలు సంక్రాంతికి రాగా అప్పట్లో కూడా ఇలాంటి ఫలితాలు వచ్చి సీన్ రిపీట్ అయ్యింది.
పెద్ద హీరోల సినిమాలతోనే సందడి
అగ్రతారల సినిమాలు విడుదలయ్యాయంటే…ఒకట్రెండు వారాలపాటు బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగుతోంది. ఆ తర్వాత కానీ కొత్త సినిమాలు విడుదలకు ముందుకు రావు. ఏటేటా తెలుగు చిత్రాలకు పోటీగా తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి వచ్చేవి. ఈ ఏడాది అజిత్ సినిమా ‘విదాముయర్చి’సినిమా వస్తుందని భావించినా రాలేదు. ఇక మొత్తంగా గేమ్‌ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందని అందరూ భావించారు. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి.
కథలు భిన్నం.. ప్రేక్షకాదరణ విభిన్నం
ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో కథపరంగా దేనికదే విభిన్నంగా ఉన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ రాజకీయ కోణాన్ని ఆవిష్కరించే కథ. రామ్‌చరణ్ యువ ఐఎఎస్ అధికారిగా, రాజకీయ నాయకుడిగా కనిపించారు. అయినా ఈ సినిమా రామ్‌చరణ్‌కు ఒకింత నిరాశనే మిగిల్చింది. ఆరేళ్ల క్రితం వచ్చిన ‘వినయ విధేయ రామ’లాగా ఈ చిత్రానికి పూర్తి నెగెటివ్ టాక్ ఏమీ రాలేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పడుతూ లేస్తూ సాగుతోంది. వసూళ్లు యావరేజ్‌గా ఉన్నాయి. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సుమారు రూ.500 కోట్లు బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే పూర్తిగా రాజకీయ కోణంలో సాగటంతో ప్రేక్షకులకు పండుగ సీజన్‌లో పెద్దగా ఎక్కలేదు. మొత్తం ఐదు గంటల రన్‌టైంతో తీశామనీ, రెండు గంటలకు కుదించటంతో తనకే సంతృప్తిగా లేదని దర్శకుడు తన తాజా ఇంటర్వ్యూలో ప్రకటించటం గమనార్హం. రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ, మరో పాత్రలో అంజలి నటించి మెప్పించారు. కథలో గందరగోళం ఉండటంతో సీన్లలో అసమతుల్యత పాటించటంతో సగటు ప్రేక్షకులకు నప్పలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ‘జరగండి..’, ‘రా మచ్చా మచ్చా..’, ‘ధోప్’ వంటి పాటలు బాగానే ఆకట్టుకున్నాయి.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వం వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ కూడా మిశ్రమ ఫలితాన్నే అందుకుంది. సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ నుంచి వచ్చిన చిత్రం ఇదే. ఆట షురూ అంటూ పక్కా మాస్ యాంగిల్‌తో బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. కథ రొటీన్ అయినా తెరకెక్కించటంలో దర్శకుడు కొత్తదనం, ఎఫెక్ట్ కనిపించింది. యాక్షన్ పార్ట్ మొత్తం సగటు తెలుగు, మాస్, కమర్షియల్ సినిమాకు భిన్నంగా హాలీవుడ్ స్లీక్ యాక్షన్‌ను తలపించేలా చేశారు. కృష్ణమూర్తి కుటుంబం, పాప, ఎమ్మెల్యే త్రిమూర్తులు, అతడి తమ్ముడు ఈ మూడు పాత్రలు చుట్టూ తిరిగిన కథ కాస్త నెమ్మదిగా సాగుతాయి. నానాజీగా బాలయ్య ఎంట్రీ బాగుంది. ఫస్టాఫ్ పాప ఎమోషన్‌ని ఎలివేట్ చేయటానికి చాలా సమయం తీసుకున్నారు. మరోవైపు స్పెషలాపీసర్ స్టీఫెన్ (షైన్ టామ్ చాకో) డాకు గురించి చేసే అన్వేషణ డాకూ పాత్రపై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అక్కడ ఫైట్స్ సీక్వెన్స్ తర్వాత వచ్చే డబిడి దిబిడి సాంగ్‌కు తమన్ సంగీతం విపరీతంగా ఇచ్చారు. నీళ్లు అడిగినందుకు ఓ చిన్న పిల్లలను, ఆ ఊరిని తగులబెట్టిన విలన్ గ్యాంగ్ ఇంటికి వెళ్లి ఊచకోత కోసి, నందిని పాత్రధారి శ్రద్ధాతో పలికే సంభాషణల్లో బాలకృష్ణ తరహా ఎమోషన్స్ మిస్సయ్యాయి. పవర్‌ఫుల్ డైలాగులు అంతంతమాత్రమే. కామెడీ పెద్దగా లేనే లేదు.
సీనియర్ నటుడు వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బ్లస్టర్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 8వ సినిమా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం థియేటర్లలో నవ్వుల జల్లులను పూయిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మించిన చిత్రం ఇది. భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. ‘గోదావరి గట్టు..’, ‘మీను’, ‘పొంగల్’తోపాటుగా మిగతా పాటలన్నీ బాగానే సాగాయి. ఐశ్వర్యరాజేష్; మీనాక్షిచౌదరీ కథానాయికలుగా ఇద్దరూ పోటీపడి నటించారు. విక్టరీ వెంకటేష్ నటించిన ఎన్నో చిత్రాలు సంక్రాంతికి విడుదలైన బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. 2019లో ఎఫ్ 2 తర్వాత సంక్రాంతికి వచ్చిన సినిమాలు కూడా ఆడలేదు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం’ పేరుతో మరో బ్లాక్‌బ్లస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఇందులో మాజీ పోలీస్ అధికారిగా, బాధ్యతగల భర్తగా, మాజీ ప్రియుడిగా బ్యాలెన్స్డ్ పాత్రలో వెంకటేష్ నటించారు. వెంకీ, మీనుతో ప్రేమ కథ బయటపడ్డాక ఇద్దరితో వేగే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. భాగ్యం పాత్రలో ఐశ్వర్యరాజేష్ జీవించిందనే చెప్పాలి. గోదావరి యాసలో ఆమె భాష సాగుతుంది. ఈ మధ్య నటించిన అన్ని చిత్రాల్లో డీ గ్లామర్‌గా కనిపించిన మీనాక్షిచౌదరి ఇందులోనూ గ్లామర్‌గా మెప్పించారు. నటనలోనూ కథానాయికలు ఇద్దరూ పోటీపడ్డారు. భార్య, మాజీ ప్రియురాలి మధ్య సన్నివేశాల్లో బయటపడటానికి వెంకటేష్ నటన, హావభావాలు రక్తికట్టిస్తాయి. వెంకీ తనయుడిగా నటించిన బాలనటుడు రేవంత్ బుల్లిరాజు పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలిచింది. పెద్దల పట్ల అతడు అగౌరవంగా మాట్లాడటం, తిట్లు రూపంగా మాట్లాడినా బాలుడు కావటంతో ఆయా మాటలను ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకోలేదనే చెప్పాలి. ఓటీటీ వెబ్‌సిరీస్ వల్లనే మా వాడు ఇలా మాట్లాడుతున్నాడంటూ వెంకటేష్ అనటం బుల్లిరాజు మాటల్లో తీవ్రతను తగ్గించినట్లయ్యింది. ఆద్యంతం కామెడీతో సాగటంతో బ్లాక్‌బ్లస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. 2019లో సంక్రాంతికి వెంకటేష్ నటించిన ఎఫ్ 2, రామ్‌చరణ్ నటించిన వినయ విదేయ రామ, బాలకృష్ణ నటించిన ఎన్‌టిఆర్ : కథానాయకుడు సినిమాలు రాగా ఎఫ్2నే విజయం వరించింది.