Sonu Nigam – ప్రముఖ సింగర్‌ లైవ్‌ షోలో రాళ్ల దాడి

న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌పై ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో రాళ్ల దాడి జరిగింది. ఎంగిఫెస్ట్‌ 2025లో ప్రదర్శన ఇస్తుండగా కొందరు రాళ్లు విసరడంతో ఆయన షోను ఆపేశారు. ఆదివారం ఢిల్లీ టెక్నాలజికల్‌ యూనివర్సిటీలో జరిగిన ఎంగిఫెస్ట్‌ 2025లో ఈ ఘటన జరిగింది. సోనూ నిగమ్‌ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తున్న సమయంలో లక్షకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. లైవ్‌ షో జరుగుతుండగా.. సమూహంలోని కొందరు రాళ్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లను వేదిక వైపు విసిరారు. ఈ దాడి వల్ల సోనూ తన షోను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఈ సంఘటనలో సోనూ నిగమ్‌ గాయపడలేదని, కానీ అతని టీమ్‌ లోని కొందరు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విద్యార్థులు ఇలా చేయడంతో సింగర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సోను చాలా ప్రశాంతంగా కనిపించారు. విద్యార్థులు గౌరవంగా ప్రవర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ” మనమందరం మంచి సమయం గడపాలి, నేను మీ కోసం ఇక్కడికి వచ్చాను ” అని సోను అన్నారు. ” ఆనందించాలి కానీ దయచేసి ఇలా చేయకూడదు ” సోను ప్రేక్షకులను కోరారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక సోనూ నిగమ్‌ తన షోను కొనసాగించడం విశేషం. అయితే ఈ దాడి గురించి ఇటు సోనూ నిగమ్‌ గాని, అటు వర్శిటీ నిర్వాహకులు గాని ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇండియన్‌ సినీపరిశ్రమలోని ప్రసిద్ధ గాయకులలో సోనూ నిగమ్‌ ఒకరు. హిందీలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి శ్రోతలని ఆకట్టుకున్నారు. అతనికి సొంతంగా బ్యాండ్‌ కూడా ఉంది. సోనూ నిగమ్‌ హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడలోనూ అనేక పాటలు పాడారు.

➡️