Manchu Manoj – ఇలాంటి ప్రవర్తన సమాజానికి ప్రమాదం : మంచు మనోజ్‌

హైదరాబాద్‌ : హాస్యం ముసుగులో సోషల్‌ మీడియాలో పిల్లలపై నీచమైన వీడియోలు పెడుతున్నారని ఇలాంటి ప్రవర్తన సమాజానికి ప్రమాదమని, పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంచు మనోజ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌ వేదికగా మనోజ్‌ ఘాటుగా స్పందిస్తూ పోస్ట్‌ పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడం కోసం తాను సంవత్సరం క్రితం ఇన్‌స్టా ద్వారా ఒక వ్యక్తిని సంప్రదించానని, కానీ అతడి నుంచి ఎలాంటి స్పందన లేదని మనోజ్‌ తెలిపారు. ఈరోజు అదే వ్యక్తి సోషల్‌ మీడియాలో పిల్లలపై నీచమైన కామెంట్స్‌ చేస్తున్నాడని, ఇలాంటి వారిని ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పిల్లలు, మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీ అధికారులకు మంచు మనోజ్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ అమ్మతోడు నిన్ను వదిలిపెట్టనని ఎక్స్‌లో వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పేరెంట్స్‌ కాస్త ఆలోచించండి : హీరో సాయిధరమ్‌ తేజ్‌
ఇదే అంశంపై ఇప్పటికే హీరో సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన సంగతి విదితమే. సామాజిక మాధ్యమ ప్రపంచం క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలని పేరెంట్స్‌కు విజ్ఞప్తి చేశారు. మానవ మఅగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదని తెలిపారు. అలాంటి వాటిని అరికట్టేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రులు భట్టి, పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్‌ చేశారు. ఓ బాలికకు సంబంధించిన వీడియోకు కొందరు ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేసిన తీరును సాయిధరమ్‌ తేజ్‌ ప్రస్తావించారు. ఈ పోస్ట్‌కు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. చిన్నారులపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారిపై సైబర్‌ బ్యూరోలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినట్లు డిజిపి రవిగుప్తా వెల్లడించారు.

➡️