‘సన్‌ఫ్లవర్స్‌..’ ఆస్కార్‌కి ఎంపిక

‘సన్‌ ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో’ అనే భారతీయ షార్ట్‌ ఫిలిం 2025 ఆస్కార్‌కు అర్హత సాధించింది. చిదానంత ఎస్‌ నాయక్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్‌ రేసుకు అర్హత దక్కించుకుందని చిత్ర నిర్మాత తెలిపారు. పలు హాలీవుడ్‌ చిత్రాలతో పోటీపడిన ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో ఎంట్రీ ఇవ్వటంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. లైవ్‌ యాక్షన్‌ విభాగంలో తమకు అవకాశం దక్కినట్లు పేర్కొన్నారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ -2024 ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ఈ చిత్రాం అవార్డు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీపడి తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 16 నిముషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్‌ ఫిలింను కన్నడ జానపద పథ ఆధారంగా తెరకెక్కించారు. ఓ వృద్ధురాలి కోడిని కొందరు దొంగలించటంతో కథ ప్రారంభం అవుతుంది. ఎలాగైనా సరే దానిని కనుగొని ఆ కోడిని తిరిగి తెచ్చుకోవడం కోసం ఆమె పడే తపనను ఇందులో దర్శకుడు చూపారు. ఇప్పటికే కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సత్తా చాటిన ‘సన్‌ ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో’ చిత్రం ఆస్కార్‌ అవార్డును కూడా దక్కించుకుంటుందని ఆశిస్తున్నారు. మైసూరుకు చెందిన నాయక్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఎంబిబిఎస్‌ పూర్తిచేసిన ఆయన సినిమా నిర్మాణ రంగం వైపు అడుగులేస్తున్నారు. ఆయన నిర్మించిన ఈ సినిమా ఆస్కార్‌కు అర్హత సాధించటంతో తన సొంతవూరైన శివమొగ్గలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే భారత్‌ నుంచి ‘లాపతా లేడీస్‌’ ఆస్కార్‌ బరిలో ఉన్న విషయం తెలిసిందే. కిరణ్‌ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

➡️