సూర్యకాంతం టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి. కాకినాడ ప్రాంతంలో పుట్టిన ఆమె జెమిని స్టూడియో నిర్మించిన ‘చంద్రలేఖ’ చిత్రంతో డాన్సర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. 1946లో నటిగా కెరీర్ ప్రారంభించిన సూర్యకాంతం నాలుగున్నర దశాబ్దాలపాటు దక్షిణాది ప్రేక్షకులను అలరరించారు. 1994లో వచ్చిన ఎస్.పి.పరశురామ్ ఆమె నటించిన చివరి చిత్రం. అదే సంవత్సరం డిసెంబర్‌లో సూర్యకాంతం మరణించారు. ఈ ఏడాది ఆమె శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సూర్యకాంతం తనయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గత ఏడాది నవంబర్ 5న చెన్నైలో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా ‘ఆంధ్రుల అభిమాన అత్తగారు’ పుస్తక ఆవిష్కరణతో సూర్యకాంతం శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. తదుపరి సెప్టెంబర్ 11వ తేదిన శత జయంతి వేడుకల్లో భాగంగా నరవ ప్రకాశరావు సహకారంతో పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షతన విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మరో వేడుక జరిగింది. వచ్చే నెల 13న జానకిరామ్ చౌదరి సహకారంతో ‘ది యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్’ కాకినాడ వారి ఆధ్వర్యంలో దంటు భాస్కరరావు గారి సహాయ సహకారాలతో దంటు కళాక్షేత్రం, కాకినాడలో మరొక ‘శతజయంతి’ కార్యక్రమం జరగబోతోంది’ అని ఆయన తెలిపారు.