‘ఐఫా’ అవార్డ్స్ 2025 జైపూర్‌లో ముగిశాయి. ఈ కార్యక్రమంలో తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం చేశారు. రెండో రోజు చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. రెండో రోజు ప్రకటించిన అవార్డుల్లో ‘లాపతా లేడీస్’ ఉత్తమ చిత్రంతో పాటు పది విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం బాలీవుడ్ స్టార్స్ చాలామంది హాజరయ్యారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు.
అవార్డ్స్ జాబితా ఇదే..
ఉత్తమ చిత్రం : లాపతా లేడీస్, ఉత్తమ నటుడు : కార్తిక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3), ఉత్తమ నటి : నితాన్షి గోయల్ (లాపతా లేడీస్), ఉత్తమ దర్శకులు,: కిరణ్ రావు (లాపతా లేడీస్), ఉత్తమ సహాయనటుడు : రవి కిషన్ (లాపతా లేడీస్), ఉత్తమ సహాయనటి : జాకీ బోడివాలా (షైతాన్), ఉత్తమ నటుడు (తొలి పరిచయం) : లక్ష్య లాల్వాని ( కిల్), ఉత్తమ నటి (తొలి పరిచయం) : ప్రతిభా (లాపతా లేడీస్), ఉత్తమ విలన్ : రాఘవ్ జాయల్ (కిల్), ఉత్తమ సంగీత డైరెక్టర్ : రామ్ సంపత్(లాపతా లేడీస్), ఉత్తమ సింగర్ -మేల్: జుబిన్ నౌటియల్ (ఆర్టికల్ 370), ఉత్తమ సింగర్ – ఫిమేల్ : శ్రేయా ఘోషల్ (భూల్ భూలయ్య 3), ఉత్తమ కథ (ఒరిజినల్): బిప్లాబ్ గోస్వామి (లాపతా లేడీస్), ఉత్తమ ఎడిటింగ్: జాబిన్ మార్చంట్ (లాపతా లేడీస్), ఉత్తమ స్క్రీన్‌ప్లే : స్నేహా దేశారు (లాపతా లేడీస్), ఉత్తమ సాహిత్యం: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్).
మార్పు వస్తోంది..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నటీమణులు సినీరంగం గురించి పలు విషయాలు మాట్లాడారు. సీనియర్ నటి మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ, ‘చిత్రసీమలోని మహిళలు ప్రతిసారీ తమని తాము నిరూపించుకోవాల్సి వస్తోంది. హీరోల్లాగే మేమూ ప్రేక్షకులను ఆకర్షించగలం. అందరం సమానమే. పారితోషికం విషయంలో కూడా వ్యత్యాసం అలాగే కొనసాగుతుంది. మాధురీ కమర్షియల్ చిత్రాలే బాగా చేయగలదు అనుకొనే సమయంలో నాకు ‘మృత్యుదండ్’ చిత్రంలో అవకాశం వచ్చింది. మహిళా సాధికారతను గొప్పగా చూపించిన పాత్రను ఇందులో పోషించాను. ఓ మహిళ తలెత్తుకొని నిలిచి తనేంటో చెప్పిన చిత్రం అది. ఒకప్పుడు హెయిర్ డ్రెస్సింగ్ లాంటి ఒకటో రెండో విభాగాల్లో మాత్రమే స్త్రీలు కనిపించేవారు. నెమ్మదిగా అది మారుతూ వచ్చింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలో ఉన్నారు. నిజంగా ఇది చాలా పెద్ద మార్పు’ అని అన్నారు.
ఆస్కార్ అవార్డ్ గ్రహీత గునీత్ మోంగా మాట్లాడుతూ ‘పారితోషికం విషయంలో హీరోహీరోయిన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో నటులు స్పందించాల్సిన అవసరం ఉంది. నాయికా ప్రాధాన్య చిత్రం ‘స్త్రీ 2’ భారీగా వసూళ్లు తీసుకొచ్చింది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేయగల సత్తా మహిళల్లో ఉంది. దాని కోసం అవకాశాలు మనమే సృష్టించుకోవాలి. దర్శకుల్లో మహిళలు మూడు శాతం కంటే తక్కువే ఉన్నారు. నటుల్లో 9 శాతం కంటే తక్కువే ఉన్నారు. ఈ పరిస్థితి మారాలి” అన్నారు.
ఇదే అందరూ కోరుకునేది : మధుబాల
‘ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి ఒకప్పుడు నాయికలకు ఉండేది. కానీ రోజులు మారాయి. నేటితరం పక్కా ప్రణాళికతో సినిమాల్లోకి వస్తున్నారు. అందరూ సమానమే అనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు. ఇదే అందరూ కోరుకునేది’.
ఎంతమారితే అంత మంచిది : షబానా అజ్మీ
‘సినిమాల్లో మహిళలు అంటే గ్లామర్‌డాల్స్ అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అన్ని శాఖల్లోనూ వాళ్లు సత్తా చాటుతున్నారు. ఒకప్పటితో పోల్చుకుంటే ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అన్ని విభాగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు. అసమానతలు ఎంత తగ్గితే చిత్రసీమకు అంత మంచిది’.
ఒక్క భాషకే పరిమితం కావడం లేదు..
‘అగ్ర నటులకు దీటుగా నాయికలు నటిస్తున్నారు. అలాంటి కథలతో దర్శకరచయితలు ముందుకొస్తున్నారు. నటీమణులు ఒక్క భాషకే పరిమితం కావడం లేదు. మంచి పాత్ర అయితే ఏ భాషలో చేయడానికైనా సిద్థంగా ఉంటున్నారు. తామేంటో నిరూపించుకోవడానికి కంఫర్ట్ జోన్ దాటి మరీ ముందుకెళుతున్నారు’ అని జ్యోతిక అన్నారు.