రిషబ్ షెట్టి నటిస్తున్న ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. అయితే అడవిలో షూటింగ్ చేయడం వలన అటవీ ప్రాంతం నాశనం అవుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ షూటింగ్‌కి గ్రామ శివార్లలోని ఖాళీ మైదానాల్లో ప్రభుత్వం అనుమతిచ్చింది. చిత్రబృందం మాత్రం అక్రమంగా అడవిలోకి వెళ్లి షూట్ చేస్తుందని గ్రామస్తులు ఆరోపించారు. అంతేగాకుండా.. షూటింగ్ కోసం పేలుడు పదార్థాలు ఉపయోగిస్తున్నారని దీనివలన అడవిలో ఉన్న పక్షులతో పాటు మూగజీవాలు భయాందోళనకి గురవతున్నట్లు తెలిపారు. అలాగే పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో గ్రామస్తులకు చిత్రబృందానికి మధ్య వివాదం తలెత్తింది. గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్ర టీమ్ దాడి చేసిందని తెలుపుతూ, గ్రామస్తులంతా యెసలూరు పోలీస్ స్టేషన్‌లో కాంతార చిత్రబృందంపై కేసు నమోదు చేశారు.
