సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సరికొత్తగా …

Jun 10,2024 05:21 #heroine, #New Movies Updates

సినిమాల్లో నటించే కథానాయికలు కొన్నేళ్లపాటు స్టార్‌డమ్‌గా ఎదిగిపోతారు. పెళ్లయిన తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా వీరు మారిపోవాల్సి వస్తోంది. గతంలో సావిత్రి, జమున, జయసుధ మాదిరిగా పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్లుగా కొనసాగే అవకాశాలు ప్రస్తుతం తక్కువ. ఈ అంశంపై తాజాగా టాలీవుడ్‌ అగ్రనటి కాజల్‌ అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యాయి. బాలీవుడ్‌లో పెళ్లయిన వారు కూడా హీరోయిన్లుగా నటిస్తుంటే దక్షిణాదిలో ఆ పరిస్థితి లేదని ఆమె అన్నారు. ‘బాలీవుడ్‌, సౌత్‌ ఇండిస్ట్రీ మధ్య చాలా తేడా ఉంది. సమంత లాంటి కొంతమందిని తప్ప దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్లని పక్కన పెట్టేస్తారు. హిందీలో మాత్రం పెళ్లయినా సరే హీరోయిన్లుగా నటిస్తుంటారు. షర్మిళా ఠాకుర్‌, హేమమాలిని మొదలుకొని దీపికా పదుకొణె, ఆలియా భట్‌ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి. దక్షిణాదిలో నయనతార, సమంత లాంటి వారు తప్ప మిగిలిన వారికి అవకాశాలు రావడం లేదు. దక్షిణాదిలో నెలకొన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం’ అని కాజల్‌ చేసిన కామెంట్లు అర్థవంతమైనవే! గతంలో ఇలియానా, తాప్సీ, పూజా హెగ్డే వంటి హీరోయిన్లు కూడా ఈ తరహా కామెంట్లు చేశారు. పెళ్లి అయిన తర్వాత హీరోయిన్లు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగానే మిగలాలా? సినీ పరిశ్రమలో హీరోయిన్స్‌కి కెరీర్‌ తక్కువ కాలమే ఉంటుందా? వాళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నా కొంతకాలం తర్వాత హీరోయిన్స్‌గా తప్పుకొని అక్కా, వదిన, తల్లి, అత్త వంటి పాత్రల్లో నటించాల్సి వస్తోంది. లేదంటే కొంతమంది హీరోయిన్‌గా కెరీర్‌ అయిపోగానే పక్కకు తప్పుకుంటున్నారు.


గతంలో మన తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్‌ రమ్యకృష్ణ, అమల, రాశి, మీనా, ఇంద్రజ, మీరా జాస్మిన్‌, సదా, భూమిక, స్నేహ, జెనీలియా, లయ కొంచెం గ్యాప్‌ తీసుకొని మళ్ళీ సెకండ్‌ ఇన్నింగ్స్‌కి వచ్చారు. గుడుంబా శంకర్‌, భద్ర లాంటి సినిమాలతో మెప్పించిన మీరా జాస్మిన్‌ పెళ్లి చేసుకొని సినిమాలకి గ్యాప్‌ ఇచ్చింది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. దక్షిణాది చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. జయం, దొంగ దొంగది, అపరిచితుడు, ఔనన్నా కాదన్నా లాంటి పలు సినిమాలతో తెలుగులో మెప్పించిన ‘సదా’ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే టీవీ షోలలో జడ్జిగా, గెస్ట్‌గా రావడం మొదలు పెట్టి సినిమాల్లో కూడా సెకండ్‌ ఇన్నింగ్స్‌కి రెడీగా ఉన్నట్లుగా ప్రకటించారు. మంచి పాత్ర పడితే ఖచ్చితంగా మళ్ళీ సినిమాల్లోకి వస్తా అని అంటున్నారు. ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో తెలుగువారిని మెప్పించిన భూమిక మధ్యలో గ్యాప్‌ తీసుకొని ఆల్రెడీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. ఇప్పటికే పలు సినిమాల్లో అక్క, వదిన క్యారెక్టర్స్‌తో మెప్పిస్తున్నారు. ప్రియమైన నీకు, వెంకీ, శ్రీరామదాసు, సంక్రాంతి లాంటి సినిమాలతో తెలుగులో అలరించిన స్నేహ ఇప్పటికే అక్క, వదిన క్యారెక్టర్స్‌లో దూసుకుపోతున్నారు. సత్యం, సై, రెడీ, ఢ, బొమ్మరిల్లు, ఆరెంజ్‌ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరైన హీరోయిన్‌ జెనీలియా. బాలీవుడ్‌ హీరో రితేష్‌ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది. మధ్య మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్‌ అప్పీరెన్స్‌ ఇచ్చినా ఓ మరాఠీ సినిమాతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. తెలుగులో కూడా మంచి పాత్రలు వస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బాలకృష్ణ సినిమా నారీ నారీ నడుమ మురారి సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిరోషా ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఒకటి రెండు సినిమాల తర్వాత ఆమె తెర మీద కనిపించకుండా పోయారు. ఐశ్వర్య, గౌతమి పరిస్థితి కూడా కొంత మెరుగ్గానే ఉంది. దేవదాసు, ఓ బేబీలో మెప్పించారు. అన్నీ మంచి శకునములే వంటి చిన్న సినిమాల్లో ఆమె కనిపించారు. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే లయ అమెరికా డాక్టర్‌ని పెళ్లి చేసుకొని సెటిలయ్యారు. మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమంటున్నారు. శబ్దం అనే సినిమాలో లీడ్‌ రోల్‌ చేశారు. అనేక టీవీ షోల్లో పాల్గొంటున్నారు. మంచి ట్యాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌గా పేరు సంపాదించుకున్న ప్రియమణి హీరోయిన్‌గా కెరీర్‌లో స్టార్‌గా ఎదగలేకపోయింది. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఆమెకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. అందుకే పలు టీవీ షో లతో హల్చల్‌ చేస్తున్నారు. స్నేహ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసి ఇప్పటికే పలు సినిమాలు చేసినా ఎందుకో ఆమెకు మళ్లీ అవకాశాలు రావడం లేదు.

➡️