వాస్తవికతే ప్రామాణికం

Mar 9,2025 23:42 #Tollywood, #Tollywood actors

మలయాళం, తమిళ సినీ పరిశ్రమ నుంచి ఇటీవల చాలా వస్తున్న సినిమాలు సందేశాత్మకంగా నిలుస్తున్నాయి. దక్షిణాది పరిశ్రమలో కూడా ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే సినిమాల్లోని కథలు వాస్తవికతకు అద్దం పడుతున్నాయి. స్థానికత, వాస్తవికతకు దగ్గరంగా ఉంటున్నాయి. వాటికి ప్రేక్షకాదరణ కూడా ఎక్కువగానే ఉంటోంది. అదే తెలుగు సినిమాల్లో సమాజాన్నీ, మనిషి జాడనీ ఆవిష్కరించే కథలు అడపాదడపా మాత్రమే వస్తున్నాయి. మన చిత్రాల్లో హీరో అయితే పోకిరీనో, జులయో అవుతారు. లేదంటే మాఫియా నాయకుడిగా కనిపిస్తున్నాడు. కాలేజీ కథలంటే అతని లక్ష్యం హీరోయిన్‌ని ప్రేమించటమే! కథానాయకుడి పాత్రకి ఓ బాధ్యత, ప్రయోజనం లాంటివి చూపించటం లేదు. నిజానికి నేటి యువకులు కేవలం పోకిరీలుగా మిగిలిపోవటానికి ఇష్టపడటం లేదు. వాళ్లకంటూ ఓ జీవన పోరాటం ఉంది. ఆ కోణాలేవీ మన తెరపైకి రావటంలేదు. ‘ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చేది తనను తాను మరిచిపోవటానికే. అందుకే వినోదాన్ని ఇస్తున్నామ’ని మన దర్శకులు చాలామంది చెప్పుకుంటున్నారు. మన దగ్గర కూడా వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చే దర్శకులు కొంతమంది ఉన్నా వారి ప్రభావం తక్కువగా ఉంది.

తమిళంలో ఎలా ఉంటుందంటే…
మనిషికి పుట్టుక, చావు సహజం. వీటినే సినిమాల్లో చూపించాల్సి వస్తే తెలుగులో కథానాయకుడు, కథానాయకిల పాత్రల్లో అంత తక్కువ పాత్ర ఉంటుంది. హీరోల వద్ద దాదాపుగా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తారు. అదే తమిళంలోనైనా సహజత్వంగా చావు, ఆ తర్వాత జరిగే తంతును అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే సంపూర్ణంగా వాస్తవికతకు దగ్గరగా చూపిస్తారు. వాస్తవంగా పరిశీలిస్తే మలయాళంలో ఇంకా ఎక్కువ స్థానికత చిత్రాల్లో ఉంటుంది. ఆ తర్వాత స్థానంలో తమిళ పరిశ్రమ ఉంటుంది.

కథదే నాయక పాత్ర
తెలుగు సినిమాల్లో కథానాయకుడే మొత్తంగా కథలో లీడ్‌రోల్‌లో ఉంటారు. మంచైనా, చెడైనా తనే అంతా. కానీ తమిళంలోచి చాలా సినిమాల్లో అలా ఉండదు. తెలుగులో ఉన్నంత హడావుడి అంత అక్కడ ఉండదు. మచ్చుకు ఇప్పటికే స్టార్‌డమ్‌లో దశాబ్ధాలుగా ఉన్న రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, అజిత్‌, దళపతి విజరు, చియాన్‌ విక్రమ్‌, సూర్య, ధనుష్‌, కార్తీ, విశాల్‌, నాజర్‌ వంటి వారు తమ సహజ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. కథానాయికల్లో కూడా అంతే.
లేడీ సూపర్‌స్టార్‌గా అందరూ పిలుచుకుంటున్న నయనతార కూడా సింప్లిసిటీగా ఉండటానికి ఇష్టపడతారు. రాధిక, కీర్తిసురేష్‌; శృతిహాసన్‌, హన్సిక, ఐశ్వర్యరాజేష్‌, జ్యోతిక, ప్రియమణి, త్రిష, ప్రియాంక మోహన్‌, స్నేహ, ఐశ్వర్యరాజేష్‌, మంజువారియర్‌, రెజీనా, ఆసిన్‌ ఇలా కథానాయికలు కూడా ఏమాత్రం హడావుడి లేకుండా ఉంటారు. జయలలిత, మనోరమ, ఒడిఒక్కరసి వంటి సీనియర్‌ నటీముణులు కూడా చాలా సాదాసీదాగానే కనిపించేవారు.

హంగామా వద్దే వద్దు
టాలీవుడ్‌లోకి వచ్చిన కొత్త కథానాయకుడైనా రెండో సినిమా నుంచే హడావుడి ఎక్కువగా ఉంటుంది. కలవాంటే బౌన్సర్లను దాటుకుని వెళ్లాలి. విపరీతమైన హడావుడి. దీనికితోడు కులం, వారసత్వం వంటి సమస్యలు వేళ్లూనికుని ఉన్నాయి. తమిళ పరిశ్రమలో పరిస్థితులు కొంత భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతిభకు పట్టం కడతారు. ద్రవిడ సంస్కృతిలో భాగంగా వాస్తవికతకు అద్దంపట్టే కథలు, సమస్యలు, సమాజ పరిస్థితులు వంటివి కథాంశాలుగా వస్తుంటాయి. అక్కడి నటీనటులు కూడా అందులో లీనమై నటిస్తుంటారు.
సినిమాల ఆడియో, ప్రీరిలీజ్‌ ఈవెంట్లు, సక్సెస్‌మీట్లు, విడుదల రోజూ థియేటర్ల వద్ద పాలాభిషేకాలు వంటివి తెలుగులో ఎక్కువగా జరుగుతుంటాయి. తమిళంలో ఇలాంటి వాతావరణం ఉన్నా చాలా తక్కువ మోతాదులోనే. హంగామాలు తనకు నచ్చబోవని చాలా సందర్భాల్లో తమిళ నటుడు అజిత్‌ ప్రకటించారు. తనకు పద్మభూషణ్‌ పురస్కారం వచ్చిన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ‘ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. ఎంతోమంది సమిష్టికృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా. సినీ పరిశ్రమలో ఎంతోమంది నాకు సహకరించారు. వారందరికీ ధన్యావాదాలు. వారి మద్దతు, సహకారంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈ అవార్డు మీ అందరిదీ. వినోదాన్ని అందించటానికి ఇలాగే కష్టపడతా’ అంటూ కృతజ్ఞతాభావాన్ని ప్రకటించారు. లేడీ సూపర్‌స్టార్‌గా కంటే తన పేరుతోనే పిలిస్తే సంతోషపడతానంటూ తాజాగా నటి నయనతార ప్రకటించారు. ‘మీరెంతో ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్‌ బిరుదుకు నేను రుణపడివుంటా. బిరుదులు వెలకట్టలేనివి. వాటివల్ల కంఫర్ట్‌గా ఉండదు.’ అంటూ ఆమె ఓ నోట్‌ను సైతం విడుదల చేశారు. గతంలో కమల్‌ హాసన్‌ కూడా తనను లోకనాయకుడు అని పిలవొద్దని వినమ్రంగా అభిమానులను కోరాడు. టాలీవుడ్‌లో కూడా హంగామా వాతావరణాన్ని తగ్గిస్తే అది పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

➡️