బాధ్యులను కఠినంగా శిక్షించాలి

Feb 1,2025 18:38 #movies, #samantha

ఇటీవల కేరళకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమంత స్పందించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ‘ఇది 2025.. అయినప్పటికీ ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. హేళనగా చూడటం, ర్యాగింగ్‌ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్‌ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు మౌనంగా బాధపడుతున్నారు. మనం ఎక్కడ విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా. నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి” అని సమంత తెలిపారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టారు. కీర్తి సురేశ్‌ కూడా దీనిని ఉద్దేశించి పోస్ట్‌ పెట్టారు. ఆ బాలుడికి న్యాయం జరగాలని కోరారు. బాధ్యులను వెంటనే గుర్తించి.. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️