ముంబయి : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన పాటపై సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి హెచ్చరించారు. ఈ పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. మరోసారి పాటలు రాయలేనివిధంగా ఉంటుందని హెచ్చరించారు. సల్మాన్‌కు ధైర్యం ఉంటే వారిని రక్షించాలని సవాలు విసిరారు. ఈ వ్యక్తులపై వర్లీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా.. సల్మాన్‌ఖాన్‌కు గతంలోనూ పలుమార్లు బిష్ణోరు గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఇక, అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించడం అప్పట్లో కలకలం రేపింది. ఇటీవల సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో కర్నాటకలోని హవేరిలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాజస్థాన్‌లో మరో వ్యక్తిని కూడా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు పోలీసులు అప్పగించారు.