డెంగ్యూ జ్వరం వల్లే .. విశాల్‌ ఆరోగ్యంపై కుష్బు

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ తాజా చిత్రం ‘మదగజరాజ’. సుమారు 11 ఏళ్ల తరువాత ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇటీవల ఈచిత్ర ప్రమోషన్‌ కార్యక్రమానికి విశాల్‌ హాజరయ్యారు. ఆ కారక్రమంలో ఆయన చాలా అనారోగ్యంగా కనిపించారు. మాట్లాడుతున్నప్పుడు చేతులు వణికాయి. ఇవి చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్‌ త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌మీడియాలో ప్రకటనలు చేశారు. అవి బాగా వైరల్‌ అయ్యి, విశాల్‌ ఆరోగ్యంపై అనేక కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి కుష్బు, విశాల్‌ ఆరోగ్యంపై స్పందించారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె విశాల్‌ ఆరోగ్యం గురించి మాట్లాడారు. ‘విశాల్‌కు ఢిల్లీలో ఉన్నప్పుడే ఫీవర్‌ వచ్చింది. ఆ విషయం ఎవరికీ తెలియదు. కానీ, ‘మదగజరాజ’ సినిమా 11 ఏళ్ల తర్వాత రిలీజ్‌ అవుతుందని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్‌కు వచ్చారు. ఆ రోజు విశాల్‌ డెంగ్యూ ఫీవర్‌తో బాధ పడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగాను. ’11 ఏళ్ల తర్వాత ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి కచ్చితంగా రావాలనుకున్నాను’ అని చెప్పారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ఆ ఈవెంట్‌ పూర్తికాగానే మేం విశాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు కోలుకుంటున్నారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది యూట్యూబర్స్‌ వ్యూస్‌ కోసం విశాల్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాసేస్తున్నారు’ అని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

➡️