‘నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపార వేత్తగా మారినా సినిమాలపై ఇంట్రెస్ట్ అలానే ఉండిపోయింది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే సినిమా రంగంలోకి వచ్చాను. ఆర్టిస్టులు పేరు తెచ్చుకున్న తర్వాత ఫలానా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే చాలు. నాకు ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు. పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో, ఉపాధి కల్పించాలనే కోరికతో ఈ రంగాన్ని ఎంచుకున్నాను’ అని ‘క’ సినిమా నిర్మాత గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్‌గా నటించారు. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈనెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా గోపాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.