గతేడాదిలో నాలుగైదు నెలలు మినహా మిగతా కాలమంతా థియేటర్లు వెలవెలబోయాయి. దేశంలో మొత్తం మొత్తం 6,877 థియేటర్లు ఉండగా ఆంధ్రాలో అత్యధికంగా 1097, తమిళనాడులో 943, కర్నాటకలో 719, మహారాష్ట్రలో 703, తెలంగాణాలో 485 థియేటర్లు ఉన్నాయి. టాలీవుడ్, దక్షిణాది, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆయా ప్లాట్‌ఫారాల్లో వచ్చిన సినిమాలు ఎక్కడైనా థియేటర్లలో విడుదల చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే అనేక భాషా సినిమాలను డబ్బింగ్ చేసి ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇలా చూస్తే గతేడాది చాలావరకూ డబ్బింగ్ సినిమాలులో తెలుగులో విరివిగా వచ్చాయి.
హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2లదే హవా
గతేడాది సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, హనుమాన్ సినిమాల్లో హనుమాన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలవగా ఆ తర్వాత స్థానంలో గుంటూరు కారం ఉంది. సైంధవ్, నా సామిరంగ మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. అప్పటి నుంచి మే నెల వరకూ పెద్ద సినిమాలేమీ రాకపోవటం, ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావటం తగ్గించేశారు. ఆక్యుపెన్సీ లేకపోవటం, నిర్వాహణా ఖర్చులు తడిచిమోపెడు కావటంతో యజమానులు థియేటర్లను ఏప్రిల్‌లో మూసేశారు. మేలో విడుదలైన కల్కి, సెప్టెంబర్‌లో విడుదలైన దేవర పాజిటివ్ టాక్‌ను అందుకోవటంతో అప్పటినుంచి థియేటళ్లు కళకళలాడుతూ కనిపించాయి. డిసెంబర్‌లో విడుదలైన పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో బాహుబలి సినిమా అత్యధిక వసూళ్లు కొల్లగొట్టి అగ్రస్థానంలో ఉంది. దీనికి ముందు దీపావళి కానుకగా విడుదలైన సినిమాల్లో అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలు మంచి కథలతో బాగా ఆకట్టుకున్నాయి. విజరుసేతుపతి మహారాజ, విడుదల 2 కూడా హిట్‌గా నిలిచాయి. నాని ‘హారు నాన్న’, చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. హీరో వెంకటేష్ సైంధవ్, రవితేజ ‘ఈగల్’ ఫిబ్రవరిలో విడుదలై తీవ్రంగా నిరాశపర్చాయి. రామ్ పోతినేని- పూరీ జగన్నాథ్‌తో కలిసి చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ డబుల్ షాక్ ఇచ్చింది. మెగా హీరో వరుణ్‌తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, మట్కా రెండు సినిమాలతో పలకరించినప్పటికీ సక్సెస్‌ను మాత్రం అందుకోలేకపోయారు. విజరు దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మంచి టాక్‌ను అందుకున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. శర్వానంద్ ‘మనమే’ కూడా డిజాస్టర్‌గా మిగిలింది. అశ్విన్‌బాబు శివంభజే, అల్లు శిరీష్ బడ్డీ, రాజ్ తరుణ్ తిరగబడరా సామీతోపాటుగా కొన్ని చిన్న సినిమాలు విడుదలైనా థియేటర్లలో మాత్రం సందడి చేయలేకపోయాయి.
‘కంగువా’, ‘మట్కా’ రెండూ పీరియాడికల్ యాక్షన్ సినిమాలే. సూర్య, వరుణ్‌తేజ్ ఇప్పటివరకూ కనిపించని లుక్‌లో కనిపించినా, ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించిన కరగువా సినిమా టాలీవుడ్‌లో బాహుబలిని పోల్చిచెప్పారు. అయినా డిజాస్టర్‌గానే మిగిలింది. బాలీవుడ్‌లో ఆడియన్స్‌ను విశేషంగా అలరించిన చిత్రాల్లో ‘భూల్ భూలయా 3’, ‘సింగం అగైన్’ ఉన్నాయి. అశోక్ గల్లా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రలో నటించి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘లెమెన్’ కూడా ఆడలేదు. ‘గ్లాడియేటర్ 2’. హిందీ సినిమా ‘ది సబర్మతీ రిపోర్ట్’ కూడా పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ‘మెకానిక్ రాకీ’, సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా నటించిన చిత్రం ‘జీబ్రా’ కూడా ప్రభావాన్ని చూపలేకపోయాయి.
సినిమాల్లో సరి’కొత్త’ ఆశలు
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ 2’కు ప్రాజెక్టును చేపట్టారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్టుకు కథ, ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు సుకుమార్-రామ్‌చరణ్‌తో మరో సినిమా తీయబోతున్నారు. ఆర్‌సి 17వ సినిమాగా మైత్రీమూవీ మేకర్స్ తెరకెక్కించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న రామ్‌చరణ్-దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ ఛేంజర్’. వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద సినిమాలు. చిరంజీవి ‘విశ్వంభర’, నితిన్ ‘రాబిన్‌హుడ్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వేసవిలో వినోదాన్ని అందించటానికి ఇవి రెడీగా ఉన్నాయి. ప్రభాస్ సలార్ 2, రాజాసాబ్ షూటింగ్‌లో ఉన్నాయి. గతేడాది ఆఖరులో విడుదలైన పుష్ప 2 ఊపు ఇంకా తగ్గలేదు. కొత్త ఏడాది, అందునా సంక్రాంతికి ‘గేమ్‌ఛేంజర్’ రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్‌లో వస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ, వెంకటేష్ నటించిన చిత్రాలు కూడా విడుదల కానుండటంతో సంక్రాంతికి వెండితెర సందడి దండిగానే ఉంటుంది.