ఖగోళంలో అరుదైన ఘటన
ఒకే సారి సూర్యకాంతి చూసిన 99 శాతం ప్రజలు
వాషింగ్టన్: భూమిపై దాదాపు 99 శాతం మంది (సుమారు 820కోట్ల మంది ప్రజలు) ఒకే సమయంలో సూర్యకాంతి లేదా సంధ్యవెలుగును చూసే అరుదైన ఖగోళ ఘటన బుధవారం చోటుచేసుకుంది. భూమి వాలు,ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలం కలిసి రావడం వల్ల, బుధవారం నాడు గ్రీన్‌విచ్ కాలమానం ప్రకారం సుమారు 11:10 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.40గంటలకు ప్రపంచ జనాభాలో దాదాపు 99 శాతం మంది, అంటే సుమారు 8.2 బిలియన్ల మంది ఒకేసారి పగటికాంతిని లేదా సంధ్యా కాంతిని అనుభవించారు. ఈ అరుదైన క్షణం కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఉంది. ఈ సమయంలో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియాలో అధిక భాగం సూర్యకాంతిలో ఉంటాయి. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు ఈ జాబితాలో ఉండటం విశేషం. అయితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలు, అంటార్కిటికా, చుట్టుపక్కల సముద్ర ప్రాంతాలు మాత్రం ఈ సమయంలో చీకటిలో ఉంటాయి. ఇది ప్రకృతి సహజంగా ఏర్పడే ఖగోళ పరిణామమే అయినప్పటికీ, ఒకే సమయంలో అత్యధిక శాతంమంది సూర్యకాంతిని, సంధ్య వెలుగును చూడటం అరుదైన విషయంగా ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ సమయంలో ప్రపంచ జనాభాలో సుమారు 83 శాతం మంది పూర్తి పగటి వెలుగులో ఉండగా, మరో 7 శాతం మంది సివిల్ ట్విలైట్, 6 శాతం మంది నాటికల్ ట్విలైట్, 3 శాతం మంది ఆస్ట్రానమికల్ ట్విలైట్‌లో ఉన్నారు.
అంటే వీరికి సూర్యుడు నేరుగా కనిపించకపోయినా, వాతావరణంలో వ్యాపించిన సహజ కాంతి కారణంగా వెలుతురు కనిపిస్తుంది. ప్రపంచ జనాభాలో కేవలం ఒక శాతం మంది మాత్రమే పూర్తిగా రాత్రి చీకటిలో ఉంటారు. ఈ సమయంలో ప్రధానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలు, అంటార్కిటికా, అలాగే పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పూర్తిగా రాత్రి నెలకొంది. మిగిలిన ప్రపంచంలోని అధిక జనాభా ఉన్న ప్రాంతాలన్నీ సూర్యకాంతి లేదా సంధ్యవెలుగును పొందాయి. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని ఎక్కువ ప్రాంతాల్లో ప్రజలు వెలుతురులోనే ఉన్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం మే మధ్య నుంచి జూలై మధ్య వరకు సుమారు రెండు నెలల కాలంలో ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, జులై తొలి వారంలో ఈ ప్రభావం అత్యధిక స్థాయికి చేరుతుందని వివరించారు.








కామెంట్‌లు (0)