Sep 18,2023 22:24
ఎపి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత

 తాడేపల్లి :  ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌... సోమవారం అస్వస్థతకు గురవడంతో ఆయన తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల అనంతరం  గవర్నర్‌కు అపెండిసైటిస్‌ అని వైద్యులు ధృవీకరించారు. ఆ వెంటనే గవర్నర్‌ నజీర్‌కు రోబోటిక్ విధానం ద్వారా సర్జరీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే... ఆయన  రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి.

కాగా, గవర్నర్‌ అస్వస్థతకు గురైన సమాచారం  రాజ్‌భవన్‌ అధికారుల ద్వారా  తెలుసుకున్న వైద్యులు తొలుత విజయవాడకే వచ్చి గవర్నర్‌కు పరీక్షలు నిర్వహించారు.  వైద్యుల పరీక్షలలో  అపెండిసైటిస్‌ అని తేలడంతో  ఆస్పత్రిలో చేరాలని గవర్నర్ కు సూచించారు.  

గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్‌ ఆరా
గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు.  ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న సిఎం.... గవర్నర్‌ అస్వస్థత సమాచారం అందుకున్న వెంటనే అధికారులతో మాట్లాడారు. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు