
అమరావతి : ఎపి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సిఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 4న సదరన్ కౌన్సిల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. పట్టణాల్లో రూరల్ క్లినిక్స్ తరహాలో క్లినిక్లు ఏర్పాటు చేసే అంశంపై చర్చించనున్నారు. అర్బన్ హౌసింగ్ టిట్కో ఇళ్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ జరగనుంది. అసంపూర్తి భవనాల నిర్మాణానికి ఎమ్మార్డిఎకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించనున్నారు. 1.43 లక్షల మంది లబ్ధిదారులకు ఏపీ టిడ్కో కింద ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 300 చదరపు అడుగుల కేటాయింపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కాకినాడ గేట్వే పోర్టులో భాగస్వామ్య వాటాల బదలాయింపు అంశం కూడా చర్చకు రానుంది. ఈబీసీ నేస్తం పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది.