
ప్రజాశక్తి-భవానీపురం: ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్‌కు తమ అనుబంధ సంఘంగా గుర్తింపు ఇస్తున్నట్లు కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కారు) జనరల్ సెక్రెటరీ షిహాన్ రజినీష్ చౌదరి చెప్పారు. ఈ మేరకు అనుబంధ గుర్తింపు పత్రాలను ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ చైర్మన్ యు. బ్రహ్మానందం, ప్రెసిడెంట్ జె. విజరు కుమార్, జనరల్ సెక్రెటరీ జె. శ్రీనివాసులు, ట్రెజరర్ సి హెచ్.మహేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ జి. శేఖర్ లకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాప్ ఎదురుగా ఉన్న జెకె కరాటే అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజినీష్ చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ అసోసియేషన్ తమ కారు బాధ్యతలను నిర్వహిస్తుందని చెప్పారు. పాత సంఘమైన కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (కాప్) కోలా ప్రతాప్ సంఘాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో ఏపి స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్‌కు నూతన కమిటీని నియమించినట్లు తెలిపారు. కరాటేను పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీల స్థాయిలో ఆటగా గుర్తించడం జరిగిందని, రాష్ట్ర, జాతీయ ,అంతర్జాతీయ స్థాయిల్లో కరాటే పోటీలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు బ్రహ్మానందం, విజయకుమార్, శ్రీనివాసులు, మహేష్ బాబు, శేఖర్ మాట్లాడుతూ త్వరలోనే తమ అసోసియేషన్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కరాటే నేర్చుకునే విద్యార్థిని విద్యార్థులకు సమగ్ర శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని మంచి ప్రతిభవంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల ఒంగోలులో జరిగిన స్కూల్ గేమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి నేషనల్‌కు ఎంపికైన కృష్ణాజిల్లాకు చెందిన పలువురు కరాటే విద్యార్థులను వారు అభినందించారు.