Feb 06,2023 20:44

కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ముఖ ఆధారిత హాజరు నుంచి కార్మికులను సిబ్బందిని మినహాయించాలని, జీతాలు, హెల్త్‌ అలవెన్సు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్‌ కార్యదర్శి భాస్కర్‌ రావు, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు ఎ.జగన్మోహన్‌రావు, బి.రమణ మాట్లాడుతూ పర్మినెంట్‌ కార్మికులకు జీతాలు, సరెండర్‌ లీవుల డబ్బులు , కాంట్రాక్ట్‌ కార్మికులకు మూడు నెలల బకాయి హెల్త్‌ అలవెన్స్‌ లు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీవో 30 ప్రకారం ఇంజినీరింగ్‌, వాటర్‌ సప్లై, కార్మికులకు పనికి తగ్గ వేతనం చెల్లిస్తామని, చెత్త తరలించే డ్రైవర్లకు, పార్కుల్లో పనిచేసే శానిటరీ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ లు చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ నేటికీ నెరవేరలేదని అన్నారు. మరణించిన రిటైర్డు కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని, విలీన ప్రాంత కార్మికులను కార్పొరేషన్‌ కార్మికులుగా గుర్తించాలని, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18500 జీతం చెల్లించాలని కోరారు. అనంతరం కమిషనర్‌కు వినతి అందజేశారు. ధర్నాలో నాయకులు ఎన్‌. పైడిరాజు, రజని, కృష్ణ, శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.