Aug 19,2022 12:49

ఉక్రెయిన్‌ : 'మాకు మరొక చెర్నోబిల్‌ దుర్ఘటన వద్దు' అని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అన్నారు. రష్యా దాడి ప్రారంభించిన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్‌ జెలెన్‌స్కీ, ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియా గుటెరస్‌తో ఎర్డోగన్‌ ముఖాముఖి సంభాషించారు. ఉక్రెయిన్‌లో నిర్వహించిన త్రైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్‌- రష్యా యుద్ధానికి ముగింపు పలికే మార్గాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఎర్డోగన్‌ మాట్లాడుతూ... శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు ఐరాస మధ్యవర్తిత్వం చేసిన ధాన్యం ఎగుమతి ఒప్పందం ద్వారా ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని చర్చించినట్లు తెలిపారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని అతిపెద్ద అణు కేంద్రం జపోరిజ్జియా చుట్టూ జరుగుతున్న యుద్ధం గురించి ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాధినేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

మరొక చెర్నోబిల్‌ దుర్ఘటన వద్దు : టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌
దీనిపై ఎర్డోగన్‌ మాట్లాడుతూ 'మేము ఆందోళన చెందుతున్నాం, మాకు మరొక చెర్నోబిల్‌ ఘటన వద్దు' అని పేర్కొన్నారు. ఈ యుద్ధం ముగింపుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రానికి ఏదైనా నష్టం జరిగితే అది ఆత్మహత్యతో సమానమని ఎర్డోగన్‌తో చర్చల సందర్భంగా ఐరాస చీఫ్‌ గుటెరస్‌ హెచ్చరించారు. ఫ్లాంట్‌లోని పరిస్థితులపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు.