Jul 29,2021 19:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర డిజిపి గౌతంసవాంగ్‌ ఆదేశాలమేరకు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను జిల్లా ఎస్పీలు, డిఐజిలు ఆకస్మికంగా తనిఖీలు చేసారు. గురువారంనాడు అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను ఎస్పీ, డిఐజిలు సందర్శించి, రికార్డులను తనిఖీ చేసారు. క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలతో పాటు గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, వారి విద్యార్హతలు, వారు అందించే సేవలను అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల పరిధిలో నివసించే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అర్హత కలిగిన వారికి అందేలా చేస్తున్న చర్యలను వాకాబు చేసారు. సచివాలయాల పరిధిలో నివసిస్తున్న మహిళల రక్షణకు, సైబర్‌ నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మహిళా పోలీసులకు వివరించారు. మహిళా పోలీసుల సేవలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువయ్యేందుకు అవసరమైన చర్యలు, కార్యాచరణ చేపడతామని ఈ సందర్బంగా పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.