
ప్రజాశక్తి-బొబ్బిలి : ఎస్‌టి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ఇందిరమ్మ కాలనీకి చెందిన యానాదులు సోమవారం స్పందనలో ఆర్‌డిఒ పి.శేషశైలజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యానాది సామాజిక తరగతికి చెందిన పిట్ల శ్రీరాములు, పిరిడి రాజేష్, పిట్ల రూప మాట్లాడుతూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు కూడా చదువుకు దూరమవుతున్నారని వాపోయారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న తమ బంధువులకు ఎస్‌టి సర్టిఫికెట్ జారీ చేస్తున్నారని, ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్‌డిఒ హామీఇచ్చారు. పిల్లలను పనికి పంపించకుండా బడికి పంపించాలని సూచించారు.
ఇనాం భూములపై హక్కులు కల్పించాలి
తెర్లాం మండలంలోని బూరిపేట పంచాయతీలో ఇనాం భూములు సాగు చేసుకుని 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని సర్పంచ్ బూరి మధుసూదనరావు, మాజీ సర్పంచ్ బి.చినప్పలనాయుడు, రైతులు చెప్పారు. వాటికి పట్టాలిప్పించాలని ఆర్‌డిఒను కోరారు. ఇనాం భూములపై హక్కు లేకపోవడంతో రైతు భరోసా రావడం లేదని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని వారంతా వాపోయారు. తమ జిరాయితీ భూమి పైనుంచి సాగునీటి కాలువ అక్రమంగా తవ్వేశారని, చర్యలు తీసుకోవాలని దత్తిరాజేరు మండలం వి.కృష్ణాపురానికి చెందిన రైతు రంభ నాగభూషణం స్పందనలో ఫిర్యాదు చేశారు.