
ప్రజాశక్తి -నరసరావుపేట (పల్నాడు జిల్లా) :విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే ఎస్టిఎఫ్ఐ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ మహాసభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో భ్రమరాంబ మున్సిపల్ పాఠశాలలో మంగళవారం జరిగిన యుటిఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముందుగా ఎస్టిఎఫ్ఐ జెండా, పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి మహాసభకు 25 రాష్ట్రాలకు చెందిన పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు 810 మంది వరకు హాజరవుతారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉన్న విద్యా రంగం గురించి, ఉపాధ్యాయుల సమస్యల గురించి మహాసభలో చర్చించి తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు. విద్యారంగంలో కేంద్రం పెత్తనం నానాటికీ పెరుగుతోందని, ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాల విద్య హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ఇపి 2020 నూతన విద్యా విధానం అమలు పేరిట ప్రాథమిక విద్యా రంగాన్ని దెబ్బతీస్తున్నారని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ గెజిట్ విడుదల చేశాయని తెలిపారు. రాజకీయ అజెండాగా మారిన ఎన్ఇపి-2020, సిపిఎస్ రద్దు కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని తెలిపారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏక తాటిపై నిలబడి హక్కులు సాధించుకోవాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, యుటిఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ పి.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.